శ్రీ శివ పురాణము
తృతీయాశ్వాసము - కుమారసంభవముశా||అత్రెనేత్రుని చర్యలన్ క్రమముగా నామౌనులావింపుచున్
ధాత్రిన్ బాధకుడైన తారకుని వృత్తాంతంబు ప్రశ్నింపగన్
గాత్రింపావనయై యసాధ్యభవరుగ్మధ్వంసపీయూషమై
శ్రోత్రానందము కొల్లలాడమగునన్ సూతుండు తానిట్లనెన్
దరూలు త్రిపుట:
వాసియైన కుమారజననము వరుసతో కొంచెముగ జెప్పెద
భూసురోత్తములారా ఇపుడు పూనివినుడయ్యా ||1||
అలరుచును భవాని శంకరులందు విలాసములాడుచుండగ
ఇలను దివ్య సహస్ర వర్షము లేగిపాయెనికన్ ||2||
ద్విపద:
అంతట గీర్వాణులానకమందు
ఇంతకాలముదాక నెదురెదురుజూచి
తారకాసురునిచే తల్లడిల్లుచును
సారజ్ఞులోకచోట సభనుగావించి
యేమాయెనో కాని ఈశ్వరుని వార్త
యీమాట దెలుపంగ నెవరుగలరన్న
దేవతాముఖ్యుండు దేవగురుండు
పావకుని దరిగూర్చి పలికిరిట్లనుచు
కీర్తన - 53:
రాగం:పూరి తాళం:ఆట
ఇపుడు కటాక్షించి మీశాహుతశనా
ఇదుగో రావే మమ్మేలుకోవే ||ఇపుడు||
త్రిపుర సుందరితోను దేవుడుండిన జాడ
తెలిసీరా నునీవే తగినావే ||ఇపుడు||
ఒయ్యారి వలలోనె యుండేనుగాబోలు
యోగ్యమైన వేళబొమ్మీసుమ్మీ ||ఇపుడు||
వెయ్యారు విధముల విన్నపములుజేసి
వెలది మోహమైన తలపూ మలపూ ||ఇపుడు||
సయ్యాన రుద్రుని సతికి గర్భంబయిన
చక్కిమౌను జగము చక్కనేను ||ఇపుడు||
యీవేళ మంత్రపురీశ్వరతేజుడవిందూ
నీకు పొందు పొమ్మీ లెమ్మీ ||ఇపుడు||
కం||గిరివైరియిట్లువేడగ
వరదుండైయుల్లసించి వైశ్వానరుడున్
సురకార్యసిద్ధి కొరకును
గరళాంతకు చెంతకపుడు గ్రక్కున వెడలన్
దరూలు త్రిపుట:
1.సప్తజిహ్వలు రెండు ముఖములు జటాజూటములేను
భుజములు దీప్తిగల శృంగములు నాలుగు త్రినయనములన్
2.యుక్తముగ చరణాబ్జములు మూడొనర గౌరకళేబరంబున
రక్తమాల్యంబర విభూషణ రమ్యమలరన్
ద్విపద:
అనిహవ్య వాహనుండా శివునిజేరి
యొనరగిరికందములొదగి పోంగాను
త్రిపుర సుందరిజూచి దిగ్గునలేచి
అపుడు సిగ్గుననోర కైనంతలోన
శితికంఠుడెగపోత చిరుచెమటగల్గి
రతిభంగమైనట్టి రౌద్రంబుచేత
పావకుని ముఖమందు ప్రజమునద్రోసి
దేవదేవుడు విడిచె దేహసారమును.
వచనం:
అప్పుడా యజ్ఞ పురుషుండైన పావకుడు
భీతాహాము పొందు బహుదూరంబున జని తన మనస్సున తానేమనుకొనెను.
కీర్తన - 54:
రాగం:తోడి త్రిపుట తాళం:ఆట
చాలాయిమ్మైచ్చులకు సాహాసుడనైబుద్ధి
చాలకయొరులమాట శ్రవణముబూని
యేలాపచ్చితినయ్యయ్యో యింధునే ||యేలా||
కామవైరిరేతాము గర్భమై నిలచెను భామనుగా నెట్లు
ప్రసవింతును నే నేలవచ్చితినినయ్యయ్యో ||యేలా||
వికలము జేయ కర్మ వేగమెట్టిదొకాని
యొకటిసేయంగబోతె మొకటాయనునే ||యేలా||
దేవుడనై యీవేళ ద్రిదశూలనెట్లుజూతు
ఆహా! వారు నవ్వులాడదురేమొనే ||నేలవచ్చితి||
బావజుడిటుముందు వంతగింపుచువచ్చి
యీవిధమైనది యెరుకైయుండి నే ||నేల వచ్చితి||
పావన మంత్రపురి పంకజాసనునికి
కేవలముగ నెంతొ కించనుడనైతినే ||నేల వచ్చితి||
ఆ.వె|| అనుచు వహ్నిదేవుడద్భుత శివవీర్య
దహ్యమానమునకు తాళలేక
చింతనొందియేమి సేయుదునని స్వర్గ
పట్టణమును గూర్చి పయనమయ్యె.
దరూలు త్రపుట:
ఆ గుహాంతరమందు పార్వతి
అపుడు వసనంబులు ధరింపుచు
జాగుపడిమదిలోనయీచె
చ్చరము దెలసెన్ ||1||
కోపమున దేవతలు వసుధను
కోతులై జన్మింతురనుచు
శాపకారణమానతిచ్చెను
శాసనముగాన్ ||2||
ద్విపద:
ఆ మహాదేవి నా హరుడు పొడజూచి
మోము చుంబనమిడి ముగ్దయుందాను
సలులితజాహ్న వీసలీలంబునందు
మలవిమోచనముకై మజ్జనమాడి
అనఘులు గంధమాల్యంబరములను
వొనరశృంగారంబులనెల్ల భూషణులగుచు
ఓషధీప్రస్తంబు నొదిలిరంతటను.
వచనం:
అనంతరంబు నా మహేశ్వరుండు గోరాట్తురుంగము నావహించి స్వకీయంబైన
దివ్యయానారూఢులై భేచరమార్గంబున స్వస్థానంబైన రజిత శైలమున ప్రవేశించి
మహోత్సవంబెటువలెనుండెను.
కీర్తన - 55:
రాగం: సావేరి తాళము:ఆది
నిటలాక్షుడు జేరె కైలాసము
మోక్షకాములాట మూగిచూచిరి కైలాసము ||నిట||
వాణినాథుడు పుష్ప వర్షముజిలుకగా
ఆణిముత్రెపసర లయంబుతోడను ||నిట||
పాణి పద్మమునందు పరగనివాళుల
యేణానాయనూ లెదురీడగా ||నిట||
ప్రాణా రావణ భృంగీ భైరవులాదిగ
వీణల బాడింపుచు వేడుకొనగ ||నిట||
ప్రాణలింగము నెడబాకయ శైవులు
కోణములందుండి కొల్వగాను ||నిట||
క్షోణి మీదను మంత్రకూట నివాసుడు
త్రాణుడైయుండి జగదాంఢము నేలుచు ||నిట||
వచనం:
అపుడా సూతుండు నాతాపసుల గూర్చి ముందటి కథా ప్రసంగంబెరింగిన మరేమనుచున్నాడు.
సీ||ఆమేషవాహనుండ మరేంద్ర సభకేగి
దైవాధిపులుగాంచి దీనుడగుచు
అయినట్టి తాత్పర్యమంత దెల్పగవారు
కరుణించి చోద్యంబు లొలకిరావగనునా
నుప్పొంగి చిరునవ్వు లొలకిరావగనునా
వహ్నిదేవుని గూర్చి వగచి వగచి
చక్కులెన్నుచునొక్క సౌపాయమొనరించి
పెక్కుగా ననలున్న పెంపుజేసి.
గీ||జాహ్నవీ తటమందు నా సప్తఋషుల
నెలతలుందురు యావంక నీవుబోయి
యీశ్వరుని వీర్యమెట్లైన యింతులకును
ప్రాప్తిజేయుయియని యట్లు పలికిరంత
సీసమాలికలు:
వృతఘ్నుడావేళ నీతి హోత్రునికైన
వాయుదేవునివెంట సాయమిచ్చి
చయ్యనబొమ్మని సాగనంపంగాను
పావకుండదేగోరెను మారువేషమున
భాగీరథుని జేరెను ||1||
అంతలోనొకనాడు ఆ మునీంద్రుల యొక్క
కాంతలేడు గురుషః కాలమందు
మాఘమకరమద్ది మహపర్విణీయనుచు
స్నానమ్ములాడా వచ్చిరి పూజాద్రవ్యములు
చాలా చాలాగా దెచ్చిరి ||2||
ద్విపద:
వనవిహంగములు క్రొవ్వున లేచి మ్రోయ
దినకరతేజంబు దిశలా ధిగ్తిల్ల
దివియందున క్షత్ర దీప్తి వెలుగొంద
ధవలాక్షలాదేవతటియందు జేరి
ముఖమార్జనములాడి ముంగురులు దువ్వి
అఖిలశోభనమైన హరిద్రమలది
మదిలోన శివదేవ మాధవాయనుచు
సుదతులు జలమందు జొచ్చిరంతటను.
వచనం:
అయ్య వసరంబున కార్యార్థుడైన సప్త జిహ్వుడు రహస్యముగా సమీరుని నేమని ప్రార్థించుచున్నాడు.
కీర్తన - 56:
రాగం: కన్నెడ తాళం:ఆది
వాయుదేవా మహానుభావా ||వాయు||
నేమముగ నాయందు ననెవరు నీకుండెనేని
యీ యెడల రక్షించుయిదె సమయముసుమ్మి ||వాయు||
నాయకుడవై పర్జన్యముల గురిపించి నీవు
శ్రేయముగా నీ సృష్టి జీవనము సేతువోయి ||వాయు||
సాయకజీవులదు ప్రాణరూపుడవగుచు
న్యాయామన్యాయములనటన సేయుదువోయి ||వాయు||
అయమైనట్టి ప్రాణ యామపారాయణులకు
సహజుండవగుచు ముక్తి సరణి దెలుదుపువోయి ||వాయు||
కాయజుని క్రీడలందు గంధవాతములా వీచి
తో యజాక్షులబుద్ధి తొలుగ జేయుదువోయి ||వాయు||
మాయానటకుడైన మంత్రపురీశ్వరుని
ప్రాయుడ మాతండ్రి పరగ మ్రొక్కెను స్వామి ||వాయు||
ఉ||పావకుడిట్లు తన్ను బహుప్రార్థన సేయుచు మ్రొక్కివేడగా
దేవప్రభంజనుండతని దీనతగాంచి దయార్థచిత్తుడై
పాపనులైన యట్టి సప్తముని భార్యల వీరప్రతివ్రతస్థులన్
నేవిధమాగడింతునని యిమ్మడి వ్యాజమునొందె నంతటన్
సీసమాలికలు:
జలకంబులాడేటి సమయమందలి ప్రాణ
విభుడు చల్లనిగాలి వీవసాగె వనితలు చలి
చేత వణుకుచుందరిజేర కొకాలందేటి వేళను
ఆ వాయువులన కొంత ధూరముకేగెను ||1||
అట్టియవసరము నరయవైశ్వానరుండితుకైనొక్క
హితవుగాను పరయుగ్మమునందు భగ్గున
మండంగ కాంతలందరూ మూగిరీ శీతమున కోడి కరములు గప్పసాగిరీ ||2||
ద్విపద:
తగువసిష్ఠాచార్య ధర్మసతియును
వగువలను శిరోమణియైన తల్లి
అరుంధతీ దేవియును పేరుగలది
త్వరగాను వలువలుతాను తేబోయె
హుతవహుండా వీర్య మొకమాయచేత
సతుల గర్భమునందు సంధించిపోంగ
తనచీర నా దేవి ధరియించుకోని
వనితలందరి యొక్క వస్త్రముల్ దెచ్చె
వచనం:
నయ్యాముని మనోహరులు ధర్మశీలలగు నవ్వసనాభరణ శుభద్రవ్యాలంకృతాంకితులై
తమతమ నిత్యకృత్యంబులన్ నిడుకొని ఋష్యాశ్రమంబుల కుంజని నకృత్స్నము కళంకులైన
సతులంగని పతులేమనుచున్నారు.
కీర్తన - 57:
రాగం:కన్నెడ తాళం:ఆట
ఓ భామామణులారా వినరే
మంచిసౌపాయమేమైనగనరే ||భామ||
యేటిమగువాలు మేమేటి మొగవారము
సూటిపడి యీడైజోడడైయున్నదా
కాటకుడు బ్రహ్మయే కారణము చేతనీ
కూటమునట్లుగా కూర్చెనేమోగాని వో ||భామ||
నాటుపడి మీరు ఇన్నాండ్లు మాయిండ్లల్లో
సాటిగచెర నంటి యుంటిరేమొగాని
నేటికైనానుపో నేర్పూగలిగుండినావాటమున్నాది
పోవద్దనము సుమ్మి పో ||భామ||
నీటువగలాతో ముమ్మాటు మమ్మరయుచు
నాటకములాడకుడి నేరమేటిదొక్కె
యేటనొకమూరను పూటనొకయింటను
వేటలాడేము మావెంట సుఖమేమ వో ||భామ||
చాటమునొకరీతగ నేటు నొకరీతిగ
బూటకములింపై సొంపై యుండునే
మాట నొకరీతిగ మనసు నొకరీతిగ
తాటోటి సిన్నెలకు పాటి యనరాదు వో ||భామ||
మేటి సరసురతో మేను తమిదీరమీ
తేటవలమెల్లన కొల్లలాడెపో
బోటి జనులార యిది బొంకుటగాదు సుమి
నేటైన మంత్రపురి నిరయుని తోడె వో ||భామ||
కం||సత్యంబధిక పవిత్రము
సత్యంబిహపరములందు శ్లాఘ్యముజేయున్
సత్యము హరిహరవశ్యము
సత్యంబఖిలార్థమునకు సాధనమగపో
సీసమాలికలు:
చెలులార మీ ముఖచంద్రబింబములందు
కనవచ్చు నొకకళంకంబునిపుడు
యెందెందు బోతిరోయేమి జేసితిరొ యీ
భామదేవుని ముందునా నిజమైన
మాట పలుకుండి దాచుటెందునా ||1||
సారసాక్షుపుడు చాల ప్రస్తావించి
పెదవులు దడుపుచున్ బీరుబోయి
కన్నుల బాష్పముల్ గ్రమ్మధైర్యము లేక
పదమూలల్లాడ నొందెనూ యిగురాక
భంగి పసిడి మేనులు కందెనూ ||2||
ద్విపద:
పతుల మాటలు విని పడతులావేళ
అతిఖిన్నులైలేచి యంబరముజూచి
ఓయి భాస్కర దేవయోపరమేశ
యోమన్నదిననాథ యోసత్యరూప
మాకుదిక్కెవరు మరి సాక్షివయ్య
మీకు దెలియని కార్యమేమైనలేదు
ప్రాకటంబుగమమ్ము పాలించవయ్య
మీకు దెల్విడిగాను నిజముబలికేము
చేడెలందరుగూడి చేతులెగజూచి
నేడు మావలనే నేరంబులేదు
అని పలుకగా వినుచు నాకాశవాణి
పడతులు నిర్దోషులని పలుకగాను
యింతులు విని ధైర్యమెచ్చెరికమొంది
అంత విభులగని అతివలిట్లనిరి.
కీర్తన - 58:
రాగం:ఘంటారం తాళం:రూపక
ఓ జనపావనులారా యోదైవమునులారా
యీ జన్మంబురారా దేమిసేయ ||ఓ జన||
గొప్పవారిని జూచి కోరికలు వహించి
చప్పనాడుచు యీ శాసనము దాటిమా ||ఓ జన||
యెప్పుడెప్పుడుగుననే యేడుపు సాగించి
మెప్పైన సొమ్మలను మేమడిగినామా ||ఓ జన||
అప్పటికప్పటికి వయ్యారములుబన్ని
దెప్పుచూ పొరగిండకు దిరుగబోయేమా ||ఓ జన||
తప్పున తలచితిమా తల్లిదండ్రులను
తిప్పలేమని బ్రహ్మదేవుని దూరితమా ||ఓ జన||
వొప్పాక మీసేవా నోర జూచితిమా
ఇప్పుడు మంత్రపురీశుడెరుగడా ||ఓ జన||
శ్లో|| అస్వతంత్రమవిశ్వాసం మోక్షెపాయవివర్జితం
అతప్తస్థమనాధారం స్త్రీ జన్మదిగ్దిశుచ్యతే
గీ||భామలావేళ ఈ రీతిబలుకగాను
తపసు లాలించి యీ వింతధ్యానమొంది
చక్కగా వెలసి దయచేసి సతుల జూచి
చాల మనసూరి నెనరొంది జాలినొంది.
గీతమాలలు:
జాలిరాంగ చెలులజూచి చాలగానై యూరడించి
తాళుడి మా వలనింత తగని నేరమాయ ననుచు జాలినొంది.
ద్విపద:
మరియు గ్రతరమలౌ మంత్రముల్బూని
పరమార్థులావేళ పఠనంబుజేసి
తలచి యాపనమును త్రావించగాను
చెలుల గర్భములు విస్రావితములాయ
హరవీర్య జాజ్వల్య మామునులుజూచి
నరయకుశపింజల మందొనరగట్టి
కొనిపోయి భాగీరథీ కూలమందు
వొనరంగనొకచోట వుంచిరంతటను.
వచనం: అపుడు ఇంద్రాదిసురులు మహేంద్రాద్రిగుహనును వెడలి
నిశాంతంబున నా ప్రాంతంబుజేరి బ్రహ్మనాళంబు నెమ్మది ధీర్తిల్ల
నార్తులై స్తోత్రమేమని సేయుచున్నారు.
కీర్తన - 59:
రాగం:కన్నెడ తాళం:ఆట
గంగమ్మరావే మాయమ్మరావే
కరుణించి యీవేళ మమ్మేలుకోవే ||గంగ||
భగీరథరాజన్య ఫలితమారావే
జగములో వెలసిన జాహ్నవి రావే
గగన వాహిని సింధూ గామిని రావే
అగణితంబైన మహానది రావే ||గంగ||
భవ భవనాస్త సౌపావనము రావే
దివ్య సుందరి తీర్థ తిలకమ రావే
భువిజనాశ్రితకల్ప భూజమరావే
అవనిపై కలిగిన అమృతామర రావే ||గంగ||
బ్రహ్మ కమండల భరితమరావే
కొమ్మ పావన శీల గుణశాలి రావే
మమ్మేలు హిమశైలమకుటమ రావే
ముమ్మారుగా నీకు మ్రొక్కేము రావే ||గంగ||
జలజనాభుని పాద జాతమా రావే
లలిత సౌవర్ణాద్రి లంఘిని రావే
సలతిత ఝుషకుల నిలయమ రావే
పలుమారు మునిగణ భాగ్యమా రావే ||గంగ||
వందారు మంథెన్న వాహిని రావే
కందర్పవైరి శిఖామణి రావే
చండో వాగరవింద సారమ రావే
యిందువదన కమలేక్షణా రావే ||గంగ||
శ్లో|| ఇత్యేవం ప్రార్థితా దేవి ప్రాదు రాసీన్మహాత్మనాం|
పురతో వరదా భూత్వా దివ్యరూపేణధ్విజాః||
ద్విపద:
అపుడు గంగను జూచి యాదేవ వరులు
ఉపనీతులై మ్రొక్కి యుల్లసము నొంది
హరమూర్తి తేజంబు హస్తమునబూని
శరణాగతుల మమ్ము సాకవేతల్లి
నీకు దప్పును లేడు నిఖిల జగమందు
యీ కీర్తి లాభంబు నిపుడు గైకొమ్మి
అని దేవతలు బలికి యందివ్యగాను
తనకరంబులు జూచి ధరించెనపుడు
వచనం: యాదేవి నిజరూపంబున స్వజలంబులజేరి నిక్షేపంబైన అక్షయ వీర్యంబును
కుక్షిని వహించి యర్భకుని పెంపు దుర్భరంబైన నవమానంబు అతి ప్రయాసంబునగడువ
నొక తటాకాంతంబునందు నింతాంతశూరుని మహోదయంబెటువలె నుండూనూ.
కీర్తన - 60:
రాగం: కన్నెడగౌళ తాళం:ఏక
కుమార విభుడు జన్మించెను
శివ కుమారుడవతరించెనూ
విమాన శతములు విరించిగనుగొని
రమారమణ పతిసమానధురిగల ||కుమార||
ప్రకాశము దిశల వెలయగా
చంపకాది విరులు గురియగా
వికార శకునములోకానగనుగొని
దిగాలు పడితారకాదులడలగ ||కుమార||
చిరాయులెదురు చూడగా
నటవరాంగనలు తుళ్ళాడగ
ధరాధరుడు యా తపత్రమమరను
సురాజవదనలు నీరాంజనములిడ ||కుమార||
మునీశ్వరులు దీవించంగా
షణ్ముఖులంబులతి భాషించగా
ఘనాయుడగు షట్కరాబ్జయుగముల
రణాడ్యుడంబర జఠరమున ||కుమార||
దిశేంద్రులరసి చూడగ శశి
దివాకరులు గొనియాడగా
విశాలముగ మార్గశీర్షషషిన
యశోధనుస్త న్యపానమొసగను ||కుమార||
యిలాంగనకు భూషణముగా
మునిహితాత్ముని భీషణముగా
చెలంగుచును ధనుశరంభులతో భూ
తలంబునను మంత్రకూట పశుపతి ||కుమార||
ఇతి శ్రీ సీతారామ సరస్వతీ శిష్య ముద్దు రాజేశ్వర సునూనాం, బాలంభట్టేన విరచితాయాం,
శ్రీ మదుమామహేశ్వర కథాయాం, శ్రీ శివపురాణే కుమార సంభవనామ తృతీయాశ్వాస సమాప్తః
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి