దక్ష యాగము


                      శ్రీ శివ పురాణము
              ప్రథమాశ్వాసము - దక్ష యాగము

నైమిశారణ్యమున శౌనకాది మహామునులఁ గూర్చి సూతుండు చెప్పిన శివ పురాణ కథా ప్రసంగ మెఘ వలె నుండున్.

శ్లో॥ శ్రీ వైరాజిత మంత్రకూట నగరే సౌందర్య వంశార్ణవే!
శ్రీ రాజేశ్వర మౌని సూనురిదమాఖ్యానంకరోత్యద్భుతం!
సంక్షేపేనసుయక్షగాననతయా సత్ప్రాకృతేనోదితం!
శ్రీ శంభోజయరక్షరక్షనితరాం రక్షావిశం సర్వశః!





కీర్తన - 1:

సిద్ధి వినాయక నమోస్తుతే! శ్రీ గణరాయ జయ గణరాయ!
జయజయ దేవ హరే !!

పాశకుఠారవరాంకుశ పాణే!
పన్నగభూషణ శాయినే!!    ||శ్రీ గణ ||

మూషకయాన నిశాకర మౌళే!
మోదకహస్త భజామహే!!     ||శ్రీ గణ||

భాసిత శ్రీ లంబోదర గాత్ర !
భక్త జనాప్తి దయానిధే!!      || శ్రీ గణ||

లోహిత లోచన ధౌత శరీర!
పాహిసురాగ్ర శిఖామణే !!    || శ్రీ గణ ||

విద్యాధార గురోర్గురు మూర్తే!
విఘ్నవిదూర సమారభే !!   || శ్రీ గణ ||

మత్త గజేంద్ర ముఖాంబుజశౌరీ!
మంత్రపురీశ్వర సూనవే!!    || శ్రీ గణ ||

చం॥ ప్రతినిగమాగమంబులను భానురమైన యశంబుగల్గు
స్తుతిమరియాదలంటెనొక సొంపుగనైమధురాన్యజన్యముల్|
ఘృతమునుగొన్న భంగిశివ కీర్తన యెవ్వరికైన ఈశ్వరా
స్మృతికనుకూలమైనదని సేయుదుగాయన పూర్వకంబుగాన్॥




కీర్తన - 2:

రావే! రావే! బ్రహ్మరమణీ వాగీశ్వరీ!
రావే ముద్దులతల్లి భారతీ!మమ్ము
గావవేమాపాలి కల్పవృక్షమురీతి
గలిగితివోయమ్మ భారతీ!      ||రావే||

సావిత్రివేనిన్ను సన్నుతించుటయందు
సామర్ధ్యుడానటే భారతీ!
శ్రీవిష్ణు మొదలైన సిద్ధులుఁగొనియాడ
శ్రేయముదానవే భారతీ!       ||రావే||

ధావళ్యమైననీ తనువు వైభవమెల్ల
తలపున పూజింతు భారతీ!
భావించి నీ పాదపద్మములకు మ్రొక్కి
ప్రాణులంజలి సేతు భారతీ!    ||రావే||

పావనీయములైన పరమామ్నాయములెల్ల
బహువిద్యలైనావే భారతీ!
దేవదానవమౌనిదేవతలు నీ వలన
తెలివి నొందిరి గాదే భారతీ!       ||రావే||

యీవ్యాళనావంకా లెన్నితౌకడలేని
హీనుడగానటే భారతీ!
కేవలంబుగ నీవె కృపజేయుమని యెంతో
గీమాలుకుందునే భారతీ!         ||రావే||

నీవియ్యువరమున నేడు మా మంథెన్న
నిలయుని కథలాను భారతీ!
సేవించి నాయొక్క జిహ్వాగ్రమున నుండి
క్షేమము జేయవే భారతీ!          ||రావే||

ద్విపద:
శౌనకాదులు నైమిశారణ్య మందూ!
జ్ఞానువర్యులనేక సభనుగా జేరి
శ్రీకరంబుగ సుఖాసీనులై యుండి
ప్రాకటంబుగ వీరభద్రవిజయంబు
వెనుకవింటిమి గాని వెలయనీ వేళ
వినవేడ్కగలదని వినుతించగాను
అపుడు పౌరాణీకుండైన సూతుండు
తపసులడిగిన ప్రశ్నతాత్పర్య మొంది
శివసురిలీలలు జెప్పెదననుచు
భవదేవుని దలచి ప్రార్థించెనపుడూ!!





కీర్తన - 3:
రాగం:సావేరి                   తాళం:త్రిపుట

శరణు శివ శాశ్వత సనాతన శైలకన్యా మనోహరా!
శరణు శ్రీ రజతాద్రి నాయక జయమహేశ నమోస్తుతే!        ||శరణు||

గరళ నాశనశూల సాయక కమలదళ నిటలేక్షణా!
హలపురాంతక మృత్యు భయసంహార ధీర నమోస్తుతే !          ||శరణు||

విష్ణుమేవసునాభి నాయక విద్యుతాభ జటాధరా!
కృష్ణవారణ చర్మధరలయఖేలశీల నమోస్తుతే!           ||శరణు||

నందివాహన మంత్రపురనత జనాప్త కృపానిధే!
వందితామర లోకపాలన వరదజయద నమోస్తుతే!           ||శరణు||

వచనం: అని ముందు జగద్భందు నభినందించి ప్రశ్నానంద హృదయారవిందుడై, సుందరాహ్లాదమొందిన నాముని బృందములకేమనుచున్నాడు.


కీర్తన - 4:
రాగం:ఆనంద భైరవి              తాళం:ఏక

దుష్ప్రాపకమై యనంత కోటి బ్రమ్మాండములను మించిన
దొకటి మహాకైలస ముండూనమ్మా!  ||దుష్ప్రా||

పరమాకాశమునందు పాదుకొని!
మెరుపు కొండలమీద మేలీమైన
సురజాతి తరువుక్రింద సొంపునొందీభా!!
సురమౌనవరత్నాలవేదిక శోభాయమానమైనా ||ఒకటి మహా||

గుణశాలి యోగమాయా కుదురైయుండీ
పరమాకాశామునందు పరమాశివూనీ
ప్రణిపాతూడైనందెన్న భావించాగాను దివ్య
మణులు ధీర్తిల్లి గొడుగై మహాపన్నగములు కొలువా       ||నొకటి మహి||

అరుదుగా సత్య జ్ఞానాంతమూదై
నిరతము గతయాతనల నెలవులేక
పరమానందముతోను భాసిల్లుచు మంత్ర
పురనాథుండెల్లప్పుడు!పూనియుండెటివాస  ||మొకటి మహా||

వచనం: అట్టి పరంధామమున సృష్టి విరామమైన నిత్య నిరతి శయానంద స్వరూప విశ్వ విశ్రామ  మూర్తియై తజ్జగదుదయావసరంబున మహాప్రకృతి భూమికిదైన వ్యోమాపాణేమనుచున్నది.


కీర్తన - 5:
రాగం:శంకరాభరణం             తాళం:ఏక

శరణు శరణు శంభో! శరణు మహానుభావా!!
శరణు శరణు రుద్రా! శరణు మహేశా!!!

అరదూగ బ్రహ్మకల్పాదికాలమునందు
పరమాత్మవై వెలిగేటి బ్రహ్మవు నీవే ||శరణు||

అష్టమూర్తులు నీవై యందు కమలంబున
బుట్టి సృష్టి నిర్మాణించే స్రష్టావు నీవే   ||శరణు||

అష్టైశ్వర్యములచాత నవతారమెత్తి జగము
సుష్టుగా పాలించేటి విష్ణువు నీవే     ||శరణు||

ఇష్టాముగాక కోపమిమ్మాడింపుచు జగము
నష్టాముసేయ ప్రళయ నాథుడవీవే   ||శరణు||

కష్టమిదనక మమ్ముకావు మంథెన్న వాస
స్పష్టముగ మ్రొక్కితిమి సర్వము నీవే   ||శరణు||

సీ||ఆ దేవుక్కడొక్కనా డజుని రూపముదాల్చి
జగము నిర్మాణంబు శాయదలచి
భావంబుచే నవబ్రహ్మల నిర్మించి
సృష్టివ్యాపారంబు సేయువేళ
ఫాలదేశమునుంచి బాలుడై శ్రీ రుద్రు
డావిర్భవించగా నతడు జూచి
ప్రార్థించి కైలాస భవనంబు కల్పించి
అట్టి శ్రీ శివమూర్తినినచట నుంచి

గీ||అపుడు పదునాల్గు భువనాల యధిపతులను
ధర్మవిధులను జంగమ స్థావరముల
పూని వేదాత్ముడఖిలంబు పుట్టజేసి
సత్యలోకమునందుంతా సభను జేరెన్

యాలలు:
భారతీదేవి యిల్లాలై బ్రహ్మాండంబు  నిజమందిరమై
భూరిప్రజాపతులే తనయులై ఓ మౌనులారా!
పొందుగా సృష్టినేలును బ్రహ్మ
బ్రహ్మతనయూ యెనమండ్రుగురు
ప్రౌఢమైన తపముజేసి ఇమ్మడించినా
 నా ప్రజలాను  ఓ మౌనులారా!
ఎల్లలోకములా నిందించగా!

ద్విపద:
పురుషార్థులా బ్రహ్మపుత్రులలోన
పరగ దక్ష ప్రజాపతి యనే స్వామి
సమ్మతంబైనట్టి శతకళా దేవి
బ్రహ్మణ్యురాలైన భార్యతోగూడి
సంతానమునుగోరి సర్వకాలంబు
చింతచే యనలుని సేవించగాను
మిగులనాముని భక్తి మెచ్చియొకనాడు
జగదంబికాదేవి జన్మించెనపుడు.



 కీర్తన - 6:
రాగం:ఆనంద భైరవి         తాళం:ఆట

యోగమాయాబుట్టెను పరబ్రహ్మ  ||యోగమాయా ||

యోగమాయా బుట్టె హోమ గుండమునందు
యాగములకు దొర యైనదక్షకునియింట  ||యోగమాయా||

దూదిపాన్పుపైడి తొట్లెలో పవళించి
పాదుర మైహస్త పాద పద్మములాడ   ||యోగమాయా||

మోదంబుగొనిత్రయీ మూర్తులు బోగడంగ
భూదేశములనిండ పువ్వులు రాలంగ   ||యోగమాయా||

ఆదరంబునమౌను లమరులు మాంగల్య
నాదములెదగొని నాట్యములాండంగ   ||యోగమాయా||

పాదుగ వైయ్యార్లు బ్రహ్మండములనిందు
యాదిదైవాసుర మగుచుగారడ మాడ ||యోగమాయా||

వేదాగ్రములందు వెలయుచక్కని తల్లి
శ్రీ దేవి మంథెన్న శివునితో సమమైన ||యోగమాయా||

చం||అతివెనుదీసిమౌనివరుడంగన చేతికినిచ్చి పొంగుచున్
       సతియని పేరువెట్టి బహు సంబ్రముచేతను పెంపుపసేయగాన్|
       హితవుగనారుదుండతని యింటికినైయొక నాడువచ్చి యీ
       సతిని పినాకికిమ్మనుచు సమ్మత మొందగ బోధచేయగన్||




కీర్తన - 7:
రాగం: శంకరాభరణము         తాళం:జంపె

సతిని సదాశివునకొసగెను దక్షేశ్వరుడా ||సతిని||

క్రతుసహస్ర ఫలములు శ్రీకరమునొందగా
అతులితంబుదైన వివాహమున వేడ్కతో  ||సతిని||

పుడమిమంగళ వేదికాయను విహాయసమ్ము
భూరిశుభాంగణముదాయను
వడయు పూర్ణకలశములవి వార్దితటములై
ఉడుగణంబు తోరణంబులొందియుండగా   ||సతిని||

క్షేమమనుచు శ్రుతులుబొగుడగా సుదీ ములై
సోమదివాకరులువెలుగగా
కామధేనుకల్పతరుల్ కలనిధానమై
చామరంబులొనర ప్రభాజనుడు వీవగా   ||సతిని||

అజుడుపురోహితమునాడగా వాగ్దేవి
వేడ్కలైన కల్యాణములు బాడగా
విజయమనుచు దిక్పతులు వేత్రప్రాణులై
నిజవనాధిపతుల్ వీరుల్ నీటు గొల్పగా  ||సతిని||

అనలుడు సామ్రాణివేయగా,ర
మాది సతులరసి నీరాంజనములీయగా
యెనసిమంత్రకూటమున నేలు సామినీ
గొనియగణ్యకాలోరగము గొడుగున మరగా  ||సతిని||

గీతం:
అపుడు దక్షుడు ముదమున హరుని జూచి
పామరంబున శిరులిచ్చి ప్రస్తుతింప
నతడు కైలాసమునకేగె నంతలోన
సుజన మౌనులతోబల్కె సూతుడపుడు

యాలలు:
మక్కువాతో మునిపుంగవుడా మగువను శంకరునికిచ్చి
చక్కగాను పెండ్లి చేసెను ఓ మౌనులారా!
స్వామికీ యిల్లాలై యుండెనూ!
కన్యలూ నూరుగురుండంగ ఘనమైన దేవతలజూచీ
కన్యాదానములు తాజేసెనూ ఓ మౌనులారా!
ఖ్యాతినొందే మునిలోకమునందు

ద్విపద:
వనజనాభుడు బ్రహ్మ వాసవోత్తముడు
ఘనమునిదేవ సంఘములు గొల్వంగ
వరముని బృందముల్ పరమశివుజూడ
వరుసతో తమదివ్య వాహనాలెక్కి
ఉడుపధంబున వెడలెనుభయ నీకంబు
కడువేగమున దివ్య కైలానమేగి
రజత శైలంముగాంచిరభసంబు తోడ
అజునిగని శ్రీహరుండపుడిట్టులనియె!


కీర్తన - 8:
రాగం:ఘంటారం               తాళం:ఏక

ఎంతో సుందరమైనదీ  కైలాసమూ మనసూ
కెన్నతరముగానిదీ కైలాసమూ  ||ఎంతో||

వింతగానమృతాబ్దిలోనీ కైలాసమూ వెలసీ
వెండికొండా మీదనుండే కైలాసమూ    ||ఎంతో||

యెంతవారికీ దొరుకనీదీ  కైలానమూ జగతీ
నాట్యనుండి న్యాయము వెలయూ కైలాసము ||ఎంతో||

అంతట కల్పవృక్షములా కైలాసము పదివే
లామడవిస్తారముండు కైలాసము    ||ఎంతో||

అంతకే ప్రభువైన కైలాసమూ ప్రమాధుల
నాదరించి కొలువు సేయ కైలాసమూ   ||ఎంతో||

మంథెన్నరుద్రునిదైన కైలాసము చాల
మద్దెళ్ళుతాళాలు మ్రోయ కైలాసము  ||ఎంతో||

వచనం: అట్టి మహాశైలంబుగని విభ్రాజమానుడై జగద్రక్షకుడైన శ్రీ మహాదేవుని
సన్నిధికేతెంచి ప్రదక్షిణ ప్రణిపాతంబులొనర్చి శ్రీహరి,బ్రహ్మాదులేమనుచున్నారు


కీర్తన - 9:
రాగం:తోడి                     తాళం:ఆట

వందాన మిదిగో పాహిపాలాక్ష   ||వంద||

వందాన మిదిగో యానందములిచ్చేటి
పొందుగచరణార విందయుగమునకు    ||వంద||

సయమైన సృష్టికి లయము పాలనవృద్ధి
నయముగ గావించిన నానావ్యపకసాంబ   ||వంద||

అండపిండాండ బ్రహ్మండ భాండములందు
నిండి వెలసినట్టి నిత్యనిరంజన ||వంద||

గజధార గజమౌళి గజచర్మాంబలధరా
గజనాధార్చితపాద  గజజనకా గజభూష
||వంద||

గర్వాంధకాసుర గర్వవీభంజన
సర్వేశ మంథెన్న స్వామి దీనమందారా  ||వంద||

ద్వపద:
అని స్తోత్రములు చేసి యందుపరమించ
విని పరమేశుడు విమలలు జూచి
పేరపేరున పిల్చి ప్రేమసేయంగ
భూరియానందులై భోరుకొల్పుచును
ఉభయపార్శ్వములందు ఉర్విపతిబ్రహ్మ
సభనుగా గూర్చుండి  సకలదేవతలు
ఘనధర్మములు ప్రసంగముగడుపువేళ
మునిదక్షుడాగిరి ముదమొప్పజేరెఁ

సీ||హెచ్చైనకైలాసమీక్షించి మునిరాయు
     డంతఃపురముజొచ్చెనపుడు కోరి
    పరిశుద్ధమైవెల్గు పసిడి దేహమునందు
    తెల్లని వస్త్రముల్ తేటపడగ
    చాలసుందరమైన ఛత్రచామరములు
    తమకు తామై వెంట తగిలి కొలువ
    దర్భయు జపమాల దండంబు కలశంబు
    నమరి నాలుగుచేతులందు వెలయ

కీ|| గొప్పగా నల్లనిజడలు కొప్పుదాల్చి
    లలితమైనట్టి చెవు కుండలములదుల
   రత్నమయపాదుకలనెక్కి రభసమునకు
   దక్షమునిజేరహర గృహద్వారమునకు

యాలలు:
వెండిప్రాకారమునడుమ వెలయకల్పమానుక్రింద
పండువెన్నెలగాయుచునుండగా ఓ మౌనులారా!
పైడి రత్నాల గద్దెమీదనూ!
కోమలపద్మాసనమున గొడుగు నాగేంద్రూడుండంగా
చామరములు చెలలూ వేయంగా ఓ మౌనులారా!
సాంబశివుని కండ్లజూచెనూ.

ద్విపద:
అజుని కొమారు డవమందు జేరి
నిజగౌరవమునొంది నిలచియుండగాను
రజతాద్రివాసుడా లక్షణము జూచి
స్వజనుడనిదయను సన్మానమివ్వ
ఉచితంబుగాదనుచు నూర్కుండగాను
సుచిరంబుగామౌని చూచిపోర్వలేక
కాయంబు గదులుగా కనులెర్రజేసి
నేయంబుగాహరుని నిందింపసాగె!!!

కీర్తన - 10:
రాగం: కాంభోజి           తాళం:ఆట

ఇంతాగర్వమ్మురా నేముద్ధరించితివి నీలకంఠ! నీ
తంతుతెలిసెను బుధులు తలువరాదునిన్ను నీలకంఠా!     ||ఇంత||

అమరులలోవాడననుకుంటివోయేమొ నీలకంఠా! నీవు
అమరుడవని ఎవ్వరనగాను వినలేదు నీలకంఠా!     ||ఇంత||

తమకరా శ్రీ విభూత దయలేని వాడవు నీలకంఠా! వట్టి
మమకారమేకాని మరియేమియునులేదు నీలకంఠా!    ||ఇంత||

యముకాలు చర్మాము నెనసినవాడవు నీలకంఠా! కాటి
కమరుబూడిదపూసె ఘననీచుడవుసుమ్మీ నీలకంఠా!     ||ఇంత||

అమరీదయ్యములాతో నపవిత్రుడవు సుమ్మి నీలకంఠా!నేను
భ్రమసీ బిడ్డనూనీ పాలీటబెట్టితీ నీలకంఠా!  ||ఇంత||

కమనీమ మంథెన్న గ్రామ వాసుడవు నీలకండా! బిక్ష
మమితమునెత్తి యనుభవింపూదూవు నీలకంఠా!    ||ఇంత||

గీ||శాంతడైయుండగానిట్లు శంకరుణ్ణి
 నిందజేయుచుమౌనిదుర్నిగ్రహమున
మందభాగ్యుడు దండి దుర్మార్గుడనుచు
మత్సరమున నొంది మునిలోకమపుడుజేరి

వచనం: అప్పుడా కైలాసమున హరి బ్రహ్మాది సురలు
నభినందితులై స్వస్థానములకు జనిరంత

ద్విపద: ఆదిమన్వంతరంబందొకనాడు
       ఆదక్షమునిమౌనులందరిని జూచి
       పలికెను ద్రోహుడై భయమింతలేక
       ఇలనురుద్రక్రతు విపుడు చేసెదను
   శివుడు బుధవరులచే స్వీకృతుడుకాడు
    భువిన తిరస్కార మును జేతు ననుచు
      తనవారితోడ నీ ధరణి పై జేరి
     మునియజ్ఞశాలలన్ ముందుగావించి
     అఖిలలోకములకు అందముగబోయి
    మఖవాటముకు సురుల మరితోలితెచ్చి

యాలలు:
శాలలు యజ్ఞకుండములు సాహిత్యములు నిర్మాణించి
తాలిమీతో సుముహూర్తమందు ఓ మౌనులారా!
దక్షుడు యజ్ఞపరుడాయ
స్వవనమున శ్రుతిమంత్రాలు జదువుచు ఇంద్రాదులను
 దివము నుండి యాహ్వానింపుచు ఓ మౌనులారా!
దివ్యమౌన క్రతువు సాగించె

వచనం: అట్టి సమయంబున మహోత్సాహుండైన దక్షసోమాయాజినిగని విద్వద్ఘనుడైన యా దధీచీమహాముని యేమనుచున్నాడు.



కీర్తన - 11:
రాగం: ఆనంద భైరవి            తాళం:ఆట

ఇది యెంతో వింతైయున్నదీ యింతా
పదవి త్రైమూర్తులభవనంబనియేది   ||ఇది||

సురధేను తరువులతోను దివ్య
తరమైనశాలలు శుక్రపురము నొప్పేను
పరమానందము నొందగాను మౌని
వరమీభాగ్యము నెంతో వర్ణంపాలేనూ  ||ఇది||

త్రిదశూలు సభగానుచేర పుణ్య
సుదతులాడగ యెంతో సొగసునుమీర
ముదితాత్ములై మేలుగోర వేద
పదపాఠంబులు బ్రహ్మ సదనంబుగేర   ||ఇది||

నవనిధులన్ని కొల్లలుగా పొన్ని
జవరాండ్రు దివ్యభూషణములు వెలుగా
భువనాధిపతులాశ్రితులుగా మంచి
వివిధాన్న సత్రములూ వెయ్యార్లు గలుగా  ||ఇది||

భృగవశిష్ఠాదులు గూడ పూనీ!
నిగమోక్త విధులందు నెవకొని వేడ
తెగువాకేతనము లల్లాడ అల్ల
ఖగవాహనుడు దక్షత గలిగిచూడ   ||ఇది||

యీ మూడు జగముల మేలునీవు
నేమించగా నిందునిలచేదిజాలు
శ్రీ మంత్రకూటంబునేలు స్వామి
దేమైన కరుణ నిన్నెనసెగా బోలు    ||ఇది||

చం|| సలలితభూత సేవగణ స్వామిటురానిదియేమిచోద్యమో?
       ఇలనిటులిందుమౌళివరుడీ హవనంబునలేకపోవుటల్
       తిలకము భామగతి తీరుగ నార్యుల బృందమందు యీ
       చలనము మాను వైరమును సల్పకు మీ పరమేష్ఠినందనా!



ద్విపద:
అనియిట్లు పలుకంగా నా సోమయాజి
ఒనరగర్వమునొంది యోర్వకిట్లనియె
ఓ మునిఘలార యొకమాట వినుడి
వామదేవునియెంచ వరుసగాదండి
హరియౌన మన తండ్రి అజుని సమమౌన
సురనాథుడౌన భూసురులలోవాడ?
ఆచారహీనుండునతి క్రూరుడౌను
నీచకర్ముడు సదా నిందకర్హుండు
విని దధీచుడు మహా వేగమున జూచి
మనసునాదోళించి మరియిట్టులనియె

కీర్తన - 12:
రాగం:రేగుప్తి                 తాళం:ఆట

వినవోయి బ్రహ్మకుమారా! ఇంత
విరసాము నీకిది మేరా      ||విన||

వనజనాభునికన్న వాసవాదులకన్న
కనకగర్భునికన్న ఘనుడు రుద్రుడు సుమ్మి       ||విను||

అవనిపై సర్వ భూతములా స్వామి
నివిసించి యుండు లోకముల
శివుని కర్పణగాని వివిధ సత్క్రియలన్ని
యెవరెంత చేసిన యెలమినొందగలేరు   ||విన||

ఆదిదేవుడు సాంబమూర్తీ నిగమాదులందని
విశ్వవర్తి మోదంబు గొని త్రయీ
మూర్తులగుచు సృష్టి పాదుగ
పాలించ పరమశివుని మహాత్మ్యము   ||విను||

ఇలలోన యాగాది క్రతువుల్,జన్మాదులనిచ్చు
కర్మామార్గములూ పులకిత
శ్రీమంత్రపురమునేలినస్వామి ఫలమిచ్చె
దాతనుచు పరగ సేవించండి   ||విన||


సీసమాలికలు:
యీరీతి ఋత్విజు వీక్షించగానప్డు
వినిదక్షుడత్యంత విరసుడగుచు
మౌనీంద్రునింగని మగుడిపల్కెను
మీకిది సమ్మతిగాకుంటేనూ చనుమీ
శివుడు మీమది నెక్కు వనుకుంటేను ||1||

అదధీశుండప్పుడధిక రౌద్రమునొంది
పరగసేవకులను బారజూచి భువిన
యీ ముఖము సంపూర్తిగానేరదు
ఇటనుండ తగదురారాయ్యా!
ఆశ్రమములగూర్చి స్ఫుటముగాలేచిపోరయ్యా!  ||2||

స్వగుణంబుతోగూడి సన్మునీంద్రుడుబోవ
గనుజూచి హర్షించి మునులటుండ
అంతట నారదుండా యాగముకు వచ్చి
వ్రతచారియైన దక్షుని పొడజూచి
నవ్వనతడు జూచెవిచక్షుని    ||3||

పరామర్శ జేయుచున్ నరమునీంద్రుడుజూడ
సన్మానములజేసి సన్నుతించి నుండు
సమయమునందు ఉప్పొంగినారదుం
డతనితో మగడుపల్కెను వినవోయి
విశ్వపతియాని ముద్దులొల్కెను   ||4||

సృష్టికర్తవటంచు సుజనులు బొగుడంగ
అధిక తేజోవంతులైన మీరు
నేడు రుద్రక్రతువు నే మించితిరి కీర్తి
వడసే భూగోళా మందునా అని పెంపుజేసె
వాసుదేవుని ముందునా    ||5||

వారంత హర్షించి వాకొనిచూడంగ
చిరునవ్వులొలుకుచు శ్రీ ధరుండు
కలహాశనునిగని కనుసంజ్ఞచేయగా
వీణమీటుచులేచెను గానానందనునీ
వాణీనందనుడు చూచెను   ||6||

నివసించుమని కర్మనిలయుండువేడంగ
దేవర్షి తనవిధితెలిపి వెడలె
కడు వేగమేతెంచి కైలాసమును జేరి
త్రిపురారిని గండ్లజూచెను ముమ్మాటులనతడు
తిరిగి వందనము జేసెను   ||7||

వచనము: అట్టి మహేశ్వరుండా మహర్షినింగని జగత్కుశలంబడుగ అంతట సుఖోపవిష్ఠుడై  ఆ నారద ముని యేమనుచున్నాడు.




కీర్తన - 13:
రాగం:శ్యామకల్యాణీ           తాళం:ఏక

కనుగొంటినయ్యా!కరుణచే కావవయ్యా!
నిను నమ్మినాడనయ్యా!నీవే నా దైవమయ్యా!     || కను||

కనుమొకదండి వింత గుమిగూడియుండిరంత
అనిమిషులు మురిసిరంత అజుని కుమారుని చెంత     ||కను||

మదమున యదిరాక మదిమిముగానలేక
కుదిరి ముఖవాటమునాకు కులహాని యౌనుగాక    ||కను||

హరి దేవతూలుకోరి యాధ్వరమందు జేరి
హరమీకు ద్వేషులైరి ఆశ్చర్యమేమిశౌరి  ||కను||

నిరతము మంత్రకూట నిలయమీదానులట
తెరవున మరియామాట తెలిపివారేగిరట   ||కను||

ద్విపద:
అట్టి సురలనుజూడ  నందునే బోంగ
దీటైన దక్షుడా దిక్పలగూడి
సకల వైభవమెల్ల సమకూడి యుండ
ప్రకటించి యాగంబు పరిగి సేయంగ
అనఘుడ నీవు  నాకటుగానరాక
మనసు నాందోళించి మరిసంశయించి
క్రతునిది సంపూర్తి గాదనుకోని
మతిని సమ్మతిగాక మనవి వినిపించ
వచ్చి చెప్పితి నిజ్ఞ వరుసనడుగంగ
ముచ్చట విని శివుడు ముదముతో బలికె
మనవింత మీ తల్లి కిని జెప్పబోకు
అనిపల్క దేవర్షి యప్పుడేతెంచి
సతిని కండ్లనుజూచి సంబరమొంది
అతిభక్తితో మ్రొక్కి అతివకిట్టనియె.




కీర్తన - 14:
రాగం: సారంగ                  తాళం:ఆట

ననుగావవమ్మా శ్రీ మహాదేవి;ననుగావవమ్మా
ననుగావవమ్మానే నిను గొల్చెదనుసూరి
జనులాపత్తుల దీర్చె జనని మ్రొక్కెద తల్లి    ||నను||

బాలావునీవె నిగమాంతములకు మూలమైనావే
జాలివే, వర్ధల్లు వరగుణ శాలివే
కాలాంతకుని కనుకూలివే
బ్రహ్మాండములు పరిపాలివే దాసులు బ్రోవవే   ||నను||

సారననేత్రీ!పూర్ణేందువదనే!నీరాదగాత్రీ!
క్రూరివే బ్రహ్మాదిసుర విచారివే
మహా మంత్రములకాధారివే
బలు పాపకరసంహారివే దరిదాపునీవె    ||నను||

నాదితమోదే నీకన్నదైవ మేదివినోదే
అదివే! సాధు భక్తార్తివిభేదివే
నవకోటి శక్తుకాదివే!
శివ కేశవుల కనాదివే! ఓంకారి నీవె   ||నీవె||

చేరిమ్రొక్కెదరు సేవించి భక్తి
గోరి తలచెదరు నారివే భూతాదుల
పరిపాలివే బహు రూపులా వొయ్యారివే
లోకములపరి సంచారివే కోరికలివవే   ||నను||

తోయజపాణే!మాంపాహి మౌని రాయప్రవీణే
మాయవే మంథెన్న పురినిక గాయవే
బ్రాహ్మణోత్తముల దాయవే
పూజాలు గైకొని మ్రోయవే దాతవయ్యేవే  ||నను||


గీ||అనుచు బలుకుచు నెన్నగా నామృగాక్షి
   ఘనుని కనుగొని యత్యంత కరుణజేసి
   లలితమైనట్టి కశలంబు లలనయడుగ
   పరమ సంతోషమున మౌని పలికెనపుడు






కీర్తన - 15:
రాగం: రేగుప్తి                    తాళం:ఏక

నినుజూడగవచ్చినానే జనని వినవమ్మా!
నినుజూడ రాంగనన్నునీలగ్రీవుడు గాంచి
వనజాక్షి కిట్టిజోలి వినిపించవద్దనగాను   ||నిను||

క్షితిమీద మీ తండ్రి క్రతువు చేయుచు నిన్ను
మతి తలపకున్న యట్టి మాట వింపించు కొరకు    ||విను||

సకల భాంధవులగూడి శతకళ శతకన్యలతో
అకట భాసిల్లుచుండగ అటు నీవు లేనందుకునే     ||విను||

వరమైన శ్రీమంథెన్న పురనీవాసులదూరే
దురితుల ముందుజూచి దురితఘ్నలకు దెలిపి   ||విను||

ద్విపద:
నేను జెప్పినజోలి నీ విభునితోను
పూనిచెప్పకు మనుచు పుణ్యుడేతెంచె
అపుడు కైలాసమందా సతీదేవి
చపల బుద్ధిన తన స్వామికిట్లనియె
ఓ దేవవిను నాది ఒక విన్నపంబు
పాదుకొని మాతండ్రి బ్రాహ్మణులగూడి
సత్రయాగముబూని సల్పుచున్నాడు
మిత్రబాంధవజనుల మేలుజూడగను
ఇచ్ఛయున్నదియాజ్ఞ యివ్వుమనగాను
అచ్చట శివదేవుడతివకిట్లనియె||




కీర్తన - 16:
రాగం:శ్యామకల్యాణీ              తాళం:ఏక

నా రాజమణి పో వద్దుసుమ్మి
నా ముద్దులాడి పో వద్దుసుమ్మి      ||నా రాజ||

కద్దూనా నీకు మేరగాదు యేమందు స్త్రీ
బుద్ధి యనవలెనా ప్రొద్దుబోదా    ||నా రాజ||

వచ్చీ పిలిచితె పో వలసినదిగానియీ
పచ్చారిల్లుటనీ  పడుచుతనమా    ||నా రాజ||

మత్సరము చేత నిన్నుమందలించరువా
రుత్సాహమొందినే డుందురయ్యయ్యో  ||నా రాజ||

బిచ్చుకుని యాలివని ప్రీతిచేయరు నిన్ను
దెచ్చుమైనికాంతలు దెప్పుదురే    ||నా రాజ||

తచ్చుమాటలు మీతండ్రినన్నాడితేను
నిచ్చయముగాను విని నిలువలేనే    ||నా రాజ||

మచ్చికతోను నేడు మన మంత్రపురమునందు
తచ్చుయే మున్నదో తలచీచూడే   ||నా రాజ||

సీ|| భూతేశుడిట్లని బోధించినంగాని
          వినక దాక్షాయని వెర్రిదగుచు
మ్రొక్కుచు నవ్వుచు మొగనిపై యల్గుచు
          పోదునేనని చాల పోరుబెట్టి
అతుడూరకుండగా  నాయింతి మూర్ఖంబు
         పూని మెల్లన లేచి పోవగాను
ఘనుడు దయగల్గినొ క్కతిబోయెననుచును
        పంపివేసెను వెంటప్రమథగణము

గీ||త్వరిగముగ వారునేగుచున్ దారిమీద
    సతినిగనుగొని బహుగాను సన్నుతించ
    కోరిదాస్యములన్నియు కొలువగాను
    వెలది కైలాసముననుండి వెడలెనపుడు

యాలలు:
వేవేగమునాయజ్ఞస్థలమున్ వేడుకాతోజేరచ్చి
దేవమునులా సభారంగమునెల్లా  ఓ మౌనులారా!
దేవికండ్లాజూచీనీలుచుండే!
కావరమునా దక్షమౌని కానికాన  ఆవిధమూన
 స్త్రీలుపురుషులూ ఓ మౌనులారా!
 అతివను మందలించరైరీ

ద్విపద:
ఆ యజ్ఞ సభలోన అతి చింతగలిగి
మాయవ్వ బీరడచి మహిజూడగాను
తరుచు గౌరవమొంది దక్షుండవరుస
సురుల కాహుతులెల్ల  సొంపుగానిచ్చి
పరగరుద్రాహుతి పాట పెట్టంగ
తరలాక్షివద్దు వద్దుని తండ్రిననగ
బ్రహ్మతనయుడుగ్ర భావంబునొంది
బ్రాహ్మణులనుగూర్చి పలికెనిట్లనుచు.



కీర్తన - 17:
రాగం:ఘంటారం             తాళం:ఏక

గర్వమునకు దాసీనము గద్దునాటరే,మీరు
శర్వునాజ్ఞలవలన చలని మీటరే
ఘోరకర్మూడైవవాని గుణమేపాటిదో, దొడ్డ
వారిభావమెరగనట్టి వరుస యేటిదో
కారణముగాబోలునా కన్యనిస్తినే,ముందు
నారదుని వలన ఇంత నాటుబడితినే   ||గర్వ||

గారడి కుమ్మరియింట ఘటములౌచును,నానా
తీరులైపోవునుకర్మ తెల్యదాయెను
నేరకామీరెవ్వరైనా నేటి నుండీ,శివుని
కోరితే పాషండు లౌదురు కొలువకుండీ
ధీరతో వానికి నాకు తెగెను వినుడీ మంత్ర
పురి నాథుని సతిని వెళ్ళిపొమ్మననుడి ||మంత్ర||

గీతం:
శివుని దక్షుడిట్లనుచు దూషించగాను
పాటిబట్టిరి కొందరు బ్రహ్మఋషులు
భృగుమహాముని మీసము పెనగిదువ్వె
హాసమైతోచనాదిత్యుడపుడు నవ్వె

యాలలు:
ఎక్కువైనా బలవంతులై యింద్రాద్రీ దేవతలూ
ఋషులూ మిక్కిలి యుల్లాస మొందుచు
ఓ మౌనులారా! మేనులెల్లా పులకరించగా
మక్కువాతో మునికుంతలు మంచి
వస్త్రాభరణాములు సొక్కుచు గంధపు పుష్పములాను
ఓ మౌనులారా! సొంపుగా నెగజల్లు  చుండిరీ

ద్విపద:
ఆ విధానము జూచి అంబికాదేవి
లావుగా మదిలోన లజ్జగలదయ్యి
పతిమాటదలచి పణతి చిన్నబోయి
హితవుగానకముందు యేమిదోచకను
వెలవెలబోవుచున్ వెక్కిపడయేడ్చి
జలబిందువులుకండ్ల జారిపడగాను
తాళలేకను గద్గద స్వరమునను
నేలజూచుచునుండి నెలతయిట్లనియె


కీర్తన - 18:
రాగం:సావేరి                  తాళం:ఏక

అయ్యయ్యో!నేనిందు ఎలా వచ్చీతీ
హా!హా!హా!నేనెంత పనికి జొచ్చితీ
ఇకనేల వీడి బిడ్డనైతినీ
ఒక బండనై పుట్టకపోతినీ    ||అయ్యయ్యో||

ప్రకటముగ నా పాపి చెవులను
పతినిందవింటినీ యీ వేళనూ
ఇక యింటికేమోమున బోదున
ఇది నా నేరము తెల్యదాయెను ||అయ్యయ్యో||

సఖి నా దోషముకేమి జేయుదు
చెలి నా దేహము గాల్చి వేయుదు
అకట మంథెన్న ఫలదాతను
అలనా కన్నుల నెట్లు జూతును    ||అయ్యయ్యో||

సీ||ఆవేళ సతి దేవియని ఇట్టు లేడ్వంగ
             నందికేశుడు కోపమొంది పలికె
     హరుని ద్వేషంబెవ్వడైనను జేసిన
             ఘోరనరకము నందు కూలుగాక
     వసుధలో జనులకీ వైదిక మార్గంబు
              జన్మబంధములంన్ సాగుగాక
     అనుచు గోపతియిట్లులాడగా సభలోన
             సురిమౌనులందరు జూచిరపుడు

గీతం:
అమరముని యక్ష గంధర్వులప్సరసల
వెలయదిక్పాలకుల నెల్లవెలదిజూచి
శివుని వీడితినని చాల చింతజేసి
పతిని ధ్యానించి భక్తితో పలికెనపుడు





కీర్తన - 19:
రాగం:భైరవి                   తాళం:ఆట

ఇకనే జూచేనా నా పాలిదేవున్నిక నే జూచేనా
సకల భూతములాకు సాక్షియై యున్నట్టి
ప్రకటితంబుగ విశ్వ పతిని కన్నులనిండ   ||ఇక||

కమలాపీఠమున కొలువైయున్న ప్రమదామధ్యమున
గీతములుబాడె రమణీ సంఘమున
క్రమముగా పూజలు అమరులు సేయంగ
విమలుని కొలువందు సమముగ గూర్చిండి   ||ఇక||

అందముగాను శ్రీజాహ్నవీ,సుందరితోనూ
దేవార్షేయా బృందములోను
ఇందుశేఖర బ్రహ్మానందమిదేనని
నందివాహన నిన్ను నా వేడుకను దీర   ||వీరు||

సమ్మతిశాయా చౌరీలుముద్దు గుమ్మలు వెలయా
వాద్యములన్ని ఝుమ్మాన్ని మ్రోయ
బ్రహ్మాదిసురలెల్ల పరిచారులై పర
బ్రహ్మము మంథెన్న పరమాత్ముడనగాను  ||ఇక||

వచనం: అట్టి జగద్రక్షకుడైన పరమేశ్వరుని మదిదలంచి మరేమీ చేయుచున్నదీ.

గీతం: కోకనెగజాసి మ్రొక్కి యా కోమలాంగి
      అగ్నికుండాన దుమికిన యంతలోన
      సేవకులు లేని యఙ్ఞంబు జెరుపరాంగ
      దక్షముని జూచి మదిలోన ధ్యానమెందె





యాలలు:
నొవ్వాగలిగే మీదాసుని నోమురక్షించేటి బలము ఇవ్వుమని
 యఙ్ఞ పురుషున్ని ఓ మౌనులారా!
 ఇట్లుగా మౌని వేడుకోంగ
రవ్వాలింపుచు యేనుగులు రథము లశ్వాములు భటులు
 యివ్విధియఙ్ఞకుండమునబుట్టె నో మౌనులారా!
యీశగణములబారాదోలిరి

ద్విపద:
శివసేనలావేళ శివుకడకేగి
వివరమున నీ వార్త వివరించగానుపరమాత్ముడంతలో ప్రాకృతమొంది
చెరచెదక్షుడు యజ్ఞ జాప్యంబులను
అతిరౌద్రమునశ్వాస లధికమై రాంగ
 గతిన బొమ్మలు ముడిచి కనులెర్రజేసి
 స్థలమున తన జటా జూటి కొట్టంగ
 ప్రళయ కాలపు పిడ్గు పడ్డ విధమాయ



కీర్తన - 20:
రాగం:ఘంటారం           తాళం:రూపక

వీరుడవతరించెను వీరావేశమునా
పారమునొందని హిమకర ప్రకాశమునా  ||వీరు||

బలమున శివజటఘాటకు పార్థివమదలగను
ప్రళయమహాధ్వనులురుముచు భగభగ మండగను      ||వీరు||

స్థలమాకాశము సరిపడి తాండవ మాడుచునూ
కలగుచు పాదములందెలు ఘల్లున మ్రోయగనూ        ||వీరు||

అలయకవెయ్యి బాహులనా నాయుధములు మెరయ
చెలగిన జటలును చుక్కలు ఝల్లుఝల్లున కురియా     ||వీరు||

వెలయుచు కౌపీనంబతి వేడిమికన్నులతో
తొలకరి మోమున ధుమ ధుమ ధూమజ్వాలలతో    ||వీరు||

వులవుల వణుకుచుజగములు లికవులికటు జడగా
పులకితశ్రీమంత్ర పురీశుని బుద్దికి సరిపడగా ||వీరు||

గీతం:
      వివిధ నాట్యంబులనుజేసి వీరుడపుడు
      పరమ సంతోషమునచాల ప్రస్తుతించి
      నిగమసారుని పొడజూచి నీతితోడ
      పాణులంజలిగాబట్టి పలికెనపుడు.



కీర్తన - 21:
రాగం:సారంగ                తాళం:ఏక

సామి నీభటు నేలిచూడవే ఇదిగో మొక్కెదనే
నేమిసేయ సృజించినాడవే   ||స్వామి||

యీమహా శైలూషముకేతగు శ్రీ మదాఙ్ఞ మీరానతివ్వగా
ఆముకొని బ్రహ్మండకటాహ మీ ముహూర్తమున నేకబళింతును ||స్వామి||

మందారాద్రికులా చలంబుల ఒక చేత నేమి
మందరాడెద కందుకంబుల సుందారామైన స్వర్గమును
కిందిలోకంబునుగా జేసి అందటే పాతాళము
దెచ్చి గంధలోకము నొందసేతు  ||స్వామి||

మేరు శైలము ధూళి చేతనే
క్షణమాత్రము నందు వారిరాసుల ద్రావివేతనే
క్రూరులై  దేవాసురులొక్కసారి నాతో పోరాటమున
మారునిలిచేరా జగదేక వీరుడనసహాయ శూరుడు         ||స్వామి||

కాలమృత్యువును సంహరింతునే,అలశింశుమార
జాలమీ కొనగోట మీటుదునే శేలుగ వర
మంత్రపుర మేలు సర్వేశ్వర మాతండ్రీ వేళ
మధుసూదనుడైన లీలగాను జయింతునేభళి   ||స్వామి||

గీ|| భక్తి చేతను నా వీరభధ్రుడపుడు
మ్రొక్కి చేతులు జోడించి ముదముతోను
ఇష్టమేలాగొ మీయాఙ్ఞ యివ్వుమనగ
హరుడు దీవించి శిరమందు హస్తమొనగె

వచనం: అట్టి మహారౌద్రుడైన వీరభద్రునింగని రుద్రుడేమనుచున్నాడు.


కీర్తన - 22:
రాగం:కన్నెడగౌళ               తాళం:ఏక
దినకరాతేజానాసామి వినుమీ నా మాటా ||దినకర||

మునిదక్షుండు,మేదనీపైనీ ఘనముగా
నధ్వరము జేసెనోయీ నా స్వామీ ||విను||

అది మీ తల్లి,అరుసుకో పోంగ
కుదిరిదుడుగులన్నాడటోయి నా స్వామీ  ||విను||

విని తాళలేక,విస్మయమొంది అనలమేగతి
యన్నాదటోయి నా స్వామీ   ||విను||

మము నిందజేయు,మమకారులను
క్రమముగ ద్రుంచి వేయ వోయి నా స్వామీ ||విను||

భూమిలో మంథెన్నపురుషోత్తముడు
వేమారు దిక్కై నాడటో,యి నా స్వామీ   ||విను||

గీ||చంద్రసూర్యాగ్ని నేత్రుడు చెప్పగాను
    వినుచునే కార్యమైన గా వింతుననుచు
    పాదయుగళమును మ్రొక్కి ప్రస్తుతించ
    నతడు హర్షించి వీరున కాఙ్ఞచేసె

యాలలు:
నానా విధములైనా భూత సేనల వెంబడిగానిచ్చి
పూనిదక్షాధ్వరము చెరుపాను ఓ మౌనులారా!
పొమ్మని వీరున్ని దోలించెన్
పేరైనా ఆదిశక్తులతో భేతాళుడు ముందు నడువ
స్వారివెడలె కైలాసము నుండి వో మౌనులారా!
జ్వరములుచుట్టూర రంజిల్లా

ద్విపద:
ఆవేళముని రాయుడధ్వర్యమునను
కావింతు నీ  సృష్టి కర్తనో యనుచు
ఇష్టంబునున్మాద మెత్తి  సేయంగ
అష్ట దిక్కులు చూడనంధమై పోయె
కాననగిరులు భూకంపంబులాయ
భాను మండలమందు పరివేష్టమాయె
అటుదుర్నిమిత్తములన్నిగనరాంగ
భటులు పరుగున వచ్చి పలికిరంతటను

వచనం:
అపుడా దక్షసోమయాజి భటులు జెప్పగా దెలిసి మహముని బృందమున కేమనచున్నాడు


కీర్తన - 23:
రాగం:జళువ             తాళం:జంపె

వచ్చెవీరభధ్రుడదిగొ వచ్చె బ్రహ్మ తనయులారా!
హెచ్చుగానుపాయమేమొ యిదిగొచూడరే   ||వచ్చె||

వుల్లసమున రుద్రసేనలూరియూరి వెంటరాంగ
నెల్లజాఘంటశంఖులెనసి మ్రోయగా   ||వచ్చె||

ఘల్లుఘల్లుమనుచు కాళ్ళ గజ్జెలందెలన్ని మ్రోయ
త్రుళ్ళిపడుచు నడువగాను దుమ్మురేగగా   ||వచ్చె||

బల్లెముల్లను విచ్చుకత్తులెల్ల దళుకు తళుకు మనుచు
వెల్లపతాకములు మీద వెలసి యాడగా    ||వచ్చె||

నల్లనైన దొడ్డమేన నాగభూషణములు గలిగి
బిళ్ళ జడలు తొట్రుపడగ గలిగి పండ్లుకొరుకుచున్    ||వచ్చె||

గళమునను కపాలమాల గలిగి బొబ్బలార్చుకొనుచు
ప్రళయరాటు మంత్రకూట పతి సమానుడై    ||వచ్చె||

గీ||వినుచు దక్షుడు కోపంబు విస్తరించి
శంభుడను పేరు నేడు యీ జగమునందు
మలిపివేసెదనని చాల మత్సరమున
నీతులెన్నుచు యుద్ధంబు నిశ్చయించె

యాలలు:
ధీరుడై తొమ్మిది గ్రహములు దిక్పాలకుల
 వసువులాను పారజూచెనపుడా సభలోను
వో మౌనులారా! బ్రహ్మ తనయుడిట్లు పలికెనూ
ఇప్పుడు రక్షించావలెను ఇదియె సమయంబునుజుమ్మి
 గొప్పతనము జూపుండోయాని వో మౌనులారా!
కొనియాడి ధైర్యమివ్వంగా

ద్విపద:
అనిన దిగ్గున లేచి యా దేవవరులు
యెనసివీరుడురాంగ యెదురుగా బోయి!
తమ సైన్యములనెల్ల తాముగూర్చుకొని
మమకారులైరణోన్మాదంబు జెంది
సురులు,దానవులు,యక్షులును,కిన్నరులు
వురగగంధర్వాదు లొక పట్టు జేరి
వాహనాయుధములు వరుసగాబూని
ద్రోహులై రణమందు దుమికిరంతటను||





కీర్తన - 24:
రాగం:సారంగం        తాళం:ఏక

యుద్ధమాయేను గణగీర్వాణులకు ||యుద్ధం||

బద్ధినమురియుచు రణ భేతాళుడు
భూత పిశాచమ్ముల నటియించ ||యుద్ధం||

గుజగుజగుంపులు తముకొనియాడగ
అజరులు రణపర వశమున దిరుగగ
అవని జలధులను దిశలల్లాడగ
కుంభినిరేగుచు గగనముగుప్పగ  ||యుద్ధ||

గజములు తురగములతి గర్జింపగ
కాంచన రథములు గంటలు మ్రోయగ
విజయార్భాట భేరి శంఖంబులు
వేగేటి రబ్బున నగములు గలయగ   ||యుద్ధ||

నీరణమున కత్తులు భల్లెములను
నిఖిలాయుధములు ధగధగ మెరియగ
భుజబలవీరులు శరములు గుప్పగ
పుడమిన చుక్కలు ఝల్లునగురియగ ||యుద్ధ||

అజయుడు వీరుడు ఆర్చుచు రణమున
అమరుల దనుముచు వసుధను గూల్పగ
ద్వజముని గణములు గడగడ వణకగ
దిగులున రవి శశి కాంతులు దొలుగగ    ||యుద్ధ||

భుజశిరములుదెగి రక్తము విడిబడి
భూమినాపారగ నాకాశమ్మున
సారెకు గండ విహంగములాడగ
మంత్రపురీశుని స్వజనులుగెలువ     ||యుద్ధ||

సీసమాలలు:
అహవంబున సురులు హతమందనాదక్ష
మునిజూచి ముకుళించి మునులజూచి
శివకుమారైని గెల్వ శ్రీ హరిగలడనుచు
బహుగా ధైర్యమునాజెందెను కమలేశుని
జూచీ బ్రతమాలి శరణుబొందెనూ  ||1||

అఖిలలోకాధీశ అక్షరుండవు సర్వ
రక్షకహిత పక్ష పక్షిగమన క్షీరాంబుధి
శయన  శ్రితజన మందార
పాకారి ప్రముఖావందనా పాహి
లక్ష్మీశ! సాకార నిత్యానంద!!!    ||2||

నీవెదాతవటంచు నిన్ను నమ్మతిని
స్వామి నీవేనాదైవంబు నీలవర్ణ
యీ యధ్వరోద్ధరణ మిపుడు గావించుడి
యికయేల జాగు సేయుట  వినరాదా
యేమి యీశు తనయుని మ్రోయుటా   ||3||

అని దక్షముని వేడ హరి మిట్టిపడిలేచి
యామౌనులందరిని నాదరించి చేత
చక్రముబట్టి శంఖంబు పూరించి
వీరావేశుడై వచ్చెను రణవేదిన జేరి
వీరున్ని జూచి రెచ్చెను      ||4||

ఉర్వితల్లడమొంద ఉభయులు రణమందు
అత్యుల్బణములై ఆశుగములు
శస్త్రాస్త్రములచేత చాల పోరి
విష్ణు చక్రమును బట్టెను వీరుని
పైనేయ విశ్వమంతయును మీటెను      ||5||


దరువులు:
రబ్బుకొల్పుచునూ చక్రము రావగనది
గొబ్బునక రములతో దొరకొని జూచీకోలాహలమొందెన్
వధను చాయగాను దాని పధమునోర్వలేకా
అతులిత చక్రమును మింగగ అచ్యుతుడదిజూచెన్

వీరుడుహరి గెలిచీ యుద్ధము విశదమొందగాను
వనజాక్షుడపుడోడిన వానివలెనెపోలెన్.
రుద్రసుతుని జూచి శ్రీ హరి భధ్రమనగా,వీర
భద్రుడు బ్రతిమాలి వేడగ అద్రిధరుడేగెన్

స్వగణములతోగూడి నగుచూమాధవుడావలికి
సొగసుగ బోవగను దక్షుడు జూచి బుగులు నొందెన్.

సీ||కాలాంతకునిరీతి ఖట్వాంగుమెగబూని
    అపరవీరుడు యుద్ధమాడగాను
హత శేషులదురులనపుడు భో!భో! యని
     భగ్న వేషాంగులై పారిపోంగ
యాగంబుకై వీరుడతి వేగమునవచ్చి
     సభలోన దక్షుని చాల వెతికి
దొరకొని పడగూల్చి తురైగుచు కంఠంబు
      నానాస్త్రములచేత నరుకలేక

గీ||అర్చిమండుచు దంతంబు లదురగొరికి
 కూడి విప్రాంగనలుచుట్టు ఘొల్లుమనగ
 అపుడు దక్షుని శిరముదివ్యాయుధమున
  కోసిపడవేసెనాయఙ్ఞ గుండమందు




యాలలు:
భృగుమహామౌనీ మీసములు పీకి గణరాయుని
బొజ్జ పగులదన్నీ పూసాదిత్యునీ ఓ మౌనులారా!
పండ్లురాలగొట్టె మోమున
కోలాహలమై యా యఙ్ఞమును ఘోరమైన
 శివ సైన్యములు చూరబుచ్చి ముని జాలమునెల్ల
వో మౌనులారా! సుట్లువుడుగ గొట్టిరావేళ

ద్విపద:
విజయశంఖమునూది విరభద్రుండు
స్వజనులగు నా భూత సైన్యంబుతోడ
కైలాసనగరంబు గ్రక్కునను జేరి
పాలాక్షునకు నంత పట్టి చెప్పంగ
మునికన్యపై చాల మోహంబునొంది
ఘనమైన దుఃఖంబు కంఠంబుదట్టి
నేలజూడగ గండ్ల నీరుజారంగ
తాళలేక శివుడు తలపోసెనపుడు.

కీర్తన - 25:
రాగం:ఆహిరి                   తాళం:రూపక

యేమిసేయుదునయ్య య్యోయిక యెందుబోదునె సందరీ.  
రామ రామ యీ పాపమెక్కడ వచ్చికూడెనే సందరీ.         ||యేమి||

మౌనియాగము యిందుకోసమె మాటుజేసెనె సుందరీ
మానిని నీవు జూడబోంగ మలుపనైతిని సుందరీ.     ||యేమి||

నేను నీ మృదుగారు దేహము నీతి మాటవు సుందరీ
మానదలచిన దఃఖమాగదు మనసు నిల్వదే సుందరీ.     ||యేమి||

యీనలింపున యెందుదోచదు యెట్లునోర్తునె సుందరీ
హీనుడైన నన్ను బాసినీవెందు బోతివే సుందరీ        || యేమి||

లేనిద్రోహముగూర్చెనీ విధ కేమి సేయుదు సుందరీ
కానినిన్నడ బాసి నివిసము కల్పమాయెనె సుందరీ.      ||యేమి||

నానాభోగములీవులేనిది నాకు నెలనే సుందరీ
స్థానమైన మంథెన్నను జూడబోదమె సుందరీ         ||యేమి||


సీ||పరమాత్ముడైనను ప్రాకృతంబున జెంది
    యీలాగు దుఃఖంబు నెన్నగాను భీషణాకృతులైన బేలెత్తి ప్రమధులు
    చుట్టూరుగా జేరి చూచిరపుడు
పాదంబులకు మ్రొక్కి ప్రాణులంజలి జేర్చి
    దీనులై కన్నీరు దింపుకొనుచు
వేమారు తమ చౌల వినిసహింపగ లేక
    భస్మధారిని గూర్చి పలికిరపుడు

గీ||ద్వంద్వములులేని పరమార్థ తత్వమైన
     నిన్ను శాంతునిగా జేయ నేరమగుచు
     సామ వాక్యంబులనుచాల సన్నుతించి
     శివుని ఆనందమొందగ జేసిరపుడు.

యాలలు:
వీరభద్రుడా యఙ్ఞమును  విఘ్నమును జేసి
పోంగా పారిపోయిరి మునుల దిక్కులా
ఓ మౌనులారా! భయమున కంపాయమానులై
భిన్నగాత్రులై వెనుకాకు బెదిరిబెదిరీ చూచుకొనుచూ
 కన్నతండ్రి జాడకెగిరీ యో మౌనులారా!
దిగాలు నొంది సురులు మునులెల్లా.

ద్వపద:
చతురాననుడు దివ్య సభను గూర్చుండి
అతికౌతుకము తెల్య సట్లుండగాను
మూక మూకలుగూడి మునులు  దేవతలు
ప్రాకటంబుగ జేరి ప్రణనామ మీడి
మారుబల్క కనిల్చి మహిజూడగాను
పేరుపేరున సుతుల్ ప్రేమతో బిలిచి
ఆదరించుచు తండ్రి అడిగినంతటను
రోదించుచు ఋషివర్యులిట్లనిరి.


కీర్తన - 26:
రాగం:కన్నడగౌళ              తాళం:ఏక

యెంతోబాహు మానమయ బ్రహ్మదేవ
యెన్న డీలాగుజూడలేదు బ్రహ్మదేవ.  ||యెంతో||

మాటికి వద్దనగను బ్రహ్మదేవ
దక్షమౌని యీలాగు జేసె బ్రహ్మదేవ ||యెంతో||

యేటిరుద్రుడో కానీ బ్రహ్మదేవ
నీవు యిందుకేకంటి వేము బ్రహ్మదేవ.   ||యెంతో||

మేటి సింహముతోను బ్రహ్మదేవ
క్షుద్ర మృగముల చందమాయ బ్రహ్మదేవా ||యెంతో||

యెక్కువ హాని జేసె బ్రహ్మదేవ
మాకు దిక్కెవ్వరికలేరు బ్రహ్మదేవ.  ||యెంతో||

మంథెన్న శివుని వలన బ్రహ్మదేవ
యఙ్ఞమర్యాదలన్ని మునిగె బ్రహ్మదేవ.  ||యెంతో||

గీ||అజుడు విని యిట్టులాశ్చర్య మధికమొంది
వెలగుపడి ముక్కుమీదను వేలువేసి
నాలుకను గరిచి యేమియన్యాయ మనుచు
బ్రహ్మ సుతులను గూర్చి తాబలికనపుడు.

దరువులు:
రాగం: నాదనామక్రియ.   తాళం:జంపె

సదయుడీశునిగోరి శరణుబొందుకంటె
అధికమొక్కటి చిక్కియైనా గనుపడదు.
కదసి యగ్నిమూట గట్టు చందము గాను
యిది మహాత్ముతలనింద యేమి మేలగునే

ద్వపద:
కమలాసనుడు యిట్లు గట్టిగా చెప్పి
అమరోత్తములు మౌనులందర్ని గూడి
సత్యలోకమునుండి సాగి వెళ్ళుచును
నిత్యమగు నారుద్ర నిలయంబు జేరి
శివదేవదేవున్ని శీఘ్రమున గాంచి
వివరించి తన వార్ని వెనుకగానుంచి
శంకలువిడిపోవ చక్కులూహించి
మ్రొక్కి అంజలి జేసి ముందు నిలుచుండి
మక్కప దిక్కైన మాధవుని గూడి
చక్కగ గురి జేరి సామికిట్లనిరి

వచనం:
అపుడారుద్రునింగని హరిబ్రహ్మ లేమనుచున్నారు?


కీర్తన - 27:
రాగం:నాట                    తాళం:జంపె

రక్షించు ఫాలనయనా మమ్ము
పోషించు కమలనయనా!    ||రక్షించు||

పక్షపాతములేని పరమాత్మ వనిమాకు
దక్షతని వచ్చితిమి దాసులము యీవేళ     ||రక్షించు||

అక్షరము పరిపూర్ణమైనమీ రూపంబు
చక్షులతో పొడజూసి శరణుజొచ్చినమమ్ము.  ||రక్షించు||

కుక్షిగతమైయున్న కోటిజగదాండముల
శిక్ష రక్షణ జేయ జెల్లునే మీయందు.   ||రక్షించు||

అక్షరుడవై జీవులందు వెలుగుచుసర్వ
రక్షణంబులచేత రక్షకుడవౌదువే.  ||రక్షించు||

అపరాదులము తప్పులన్ని క్షమజేయుమీ
కృపయోగ్యులము యేనెవములెరుగని మమ్ము.         ||రక్షించు||

మిమ్ము స్తుతి జేయు మేమెంత వారలమభయ
మిమ్ము మంత్రపురీశ యిక ప్రసన్నముగమ్ము.         ||రక్షించు||

గీ||బ్రహ్మదేవుడు హరి యిట్టు బ్రతిమిలాడి
శివునియెప్పటి వరదున్ని చేసుకోని
భంగమైపోయెముని దీక్ష పాపమనుచు
తీవ్రమాసత్రమును గూర్చి పలికిరపుడు

దరువులు:
రాగం:నాదనామక్రియ.      తాళం:జంపె

పనివానినతనిన్ బ్రతికించ వేయనుచు
మునిపుంగవుని యొక్క మొండెమునుజూపెన్
జనులాపూతనలుగా  జేయుమీక్రతువు
ఘనుడావీవుద్ధరణ గావించుమనుచున్

ద్వపద:
పంచవదనుడయంత పట్టితెల్పంగ
పంచననొక గొర్రె పణత యుండంగ
శేలైన దక్షునికి శిరముగాబెట్టి
కాలారికలశోదకము చేతబూని
మునిమీద యఙ్ఞభూములమీదజల్ల
ఘననిద్ర దెలిసిన క్రమమునైనట్లు
యెనసి కన్నులు దెరచి యీశ్వరుజూచి
మునిదిగ్గునను లేచి ముందు నిలుచిండి
మేషరవము జేసి మేదిని జూడ
శేషభూషణుడును ద్వేషంబువిడిచి
యిట్టి దక్షుణ్ణిచే పట్టి రక్షింతు
వట్టిమాటలుగావై వరమిది వినుడి
యిలమందు నాముందు నిలిచి నాదంబు
వలుకకుండిన వారి పాపంబు బోదు
ఫలమివ్వనని చెప్పి పరమేశ్వరుండు
పలికె హరుడిట్లు దేవతల గూర్చి
అతని మస్తకమందుహస్తంబునుంచ
మతిన సంతోషించి మౌని స్తుతించె.






కీర్తన - 28:
రాగం:ఆహిరి                    తాళం:ఏక.

పాహిబాలేందుమౌళే-భాసురమునిజన
దాహశమితామాం-పాహి!పాహి!పాహి! ||పాహి||

స్వామినాదోషములను చాలగలవోయనుచు
యేమిజూడకు శంభో నామ,కామ,నేమా భీమా              || పాహి||

సారములేనిదీ సంసార సాగరముననుంటి
పారమొందించురణ శూరా!ఘోరా!ధీరా!వీరా!మాం!       ||పాహి||

ఫాలనయన భక్త పాలుడవనుచునిన్ను
చాలవేడితి గిరి బాలలోల!చేలా!శీలా!  ||పాహి||

పాపకర్మమునను యేపరించెను చాల
ప్రాపు నీవంటి దృతచాప;రూప;కోపా!దీపా!మాం.                ||పాహి||

దానవుండని వీడా ధర్మము గాదు సామీ
అనతివ్వవెసంది యానా!మానా!దీనావనా!       ||పాహి||

దేవనామొర నీకు తెలిసెనో తెల్వదో
ఈవరకైన సుప్రభావా!దేవా!కావా!లేవా!   ||పాహి||

వేగమే మంత్రపురి విభుడవైయేలు తండ్రి
నాగభూషణయను రాగ!యాగ!భాగ!భోగ!             ||పాహి||


వచనం:  అట్టి సమయంబున సాక్షాద్భగవద్దర్శనానంద విభవువై యా దక్షుడేమనుచున్నాడు.


 కీర్తన-29:
రాగం:కన్నెడ                   తాళం:ఆట

శంకరా!పాహి!శంకరా!        || శంకర||

శంకరా మీ పాదములకు-శరణు జొచ్చినమాత్రముననే
శంకలేదిక మాదుజన్మలు-సార్థకమాయె నీ వేళ      ||శంకరా||

మంద బుద్ధిన మీ యొక్క - మహిమ తెలియక యిన్నాళ్ళు
వంకరా కూతలు మిమ్ము- వదరిన ఫలమాయ స్వామి.    || శంకరా||

ఇంకమరి యీలాగుగాను-ఇచ్చమీదే సుమ్మి దేవా
సంకటములను బాపినన్ను-శంకమాని బ్రోవుమయ్య.           || శంకరా||

పొంకమైన జగములేలే-పురుష మీకే మివ్వగలను
బింకమువిడనాడి మ్రొక్కితి-బెరికినన్నేలుటే కీర్తి.                  || శంకరా||

పంకజాక్షుడు దేవరాజు-పద్మయోని మొదలు గాగల
కింకరులు నిటు కొలువగామీ-కృపను వీరింత  వారైరి.      ||శంకర||

తల్లివి, తండ్రివి,గురుడవు దాతవు దైవము నీవే-
యెల్ల తప్పులు బొట్టపెట్టుకో యేలుమీ మంథెన్న మందిరా.  ||శంకరా||

సీ|| మునిరాయుడీరీతి మ్రొక్కి వేడగ జూచి 
     నవ్వి ఈశ్వరుడాఙ్ఞ ఇవ్వగాను 
అపుడు దక్షమునీంద్రుడాసంగరము నందు
     మృతులైన వారిని మేలుకొలిపి
కూల్చివేసిన యఙ్ఞగుండంబులనుదిద్ధి
     సామగ్రులను చాల సంగ్రహించి
భూరిశృంగారుడై పుణ్యాహవాచన జేసి 
  ఋత్విఙ్ఞలకును వర్ణియములిచ్చి

గీ||మొదటి నుండియు యాగంబు మొదలు పెట్టి
 హోమధూమంబుగగనంబు నొడ్డగిల్ల
వేదమంత్రంబు లాహుతుల్ వెలుగగాను
బ్రాహ్మణులు జూడ కన్నుల పండుగాయె

యాలలు:
మునివారుడాయాగంతమునా మూడులోకంబులు
వారికి ఘనముగా భోజనము పెట్టెను ఓ మౌనులారా!
కానుకలు కట్నమ్ములిచ్చెను
శ్రీ విలాసులైవారెల్ల చేరి గంగాజలమాడంగ
దేవ దుందుభులు మ్రోగెను ఓ మౌనులారా!
దివ్యమైన పూవానలు గురిసెన్



ద్విపద:
తీరైనదివిజులు-దేహంబునందు
పేరైన వీరుని బిరుదులు గలిగి
యాగంబు సంపూర్తియైన తర్వాత
యెగిరెవ్వరివారి యిండ్లకు  జేర
అపుడు శంభుడు జూచెనా భూతగణము
గృపజేసికైలాస గిరిమీదకంప
హిమశైలమార్గాన ఈశ్వరుడువోయె
నమితమైనతపము నాచరించుటకు.





కీర్తన-30:
రాగం: పున్నాగ వరాళి                   తాళం: జంపె 

తపముజేసె కాలకంఠుడు-ఈలోకమందు
తపముచేసె నీలకంఠుడు       ||తపము||

విపులమైనకాంతి గలిగి-వీరబ్రహ్మచారివలెను
అపుడు ప్రజల మేలుగోరి-చేతబూని  ||తపము||

ఉత్తరభూములందు గంగ-యొడ్డుమీద వనములోన
చిత్తమైపున్నాగమనిన-చెట్టుక్రింద నొక్కడగుచు     ||తపము|| 

మృదులపద్మాసనమునందు-మేనుకదలకుండనిలిపి
ఉదరవిశ్రమయోగదండ-మూనిమీలు చూపుగలిగి       ||తపము||

మత్తభుజంగములుకంఠ-మాలకలనుగా ధరించి
మత్తగజాజినముగప్పి-మేనశ్మశాన భూదిగలిగి         ||తపము||

నెత్తిమీద జటలుముడిచి-నేత్రములను సగముమూసి
యెత్తియింద్రియములనెల్ల-నిగ్గిత్రకూటాద్రిజేరి        ||తపము ||

చిత్తుపడక బ్రహ్మనంద-సిరివహింపుచుండియాత్మ
సత్తువలనజగములేలే-స్వామి మంత్రపురీశ్వరుడు     ||తపము||

ఇతి శ్రీ సీతారామ సరస్వతీ శిష్య ముద్దు రాజేశ్వర సూనూనాం, బాలంభట్టేన విరచితాయాం, శ్రీ మదుమాహేశ్వర కథాయాం దక్షయఙ్ఞ శ్రీ వీరభద్ర విజయో పాఖ్యాన నామ యక్షగాయనే ప్రథమాశ్వాసః సమాప్తః

3 కామెంట్‌లు:

  1. చి. ఆదిత్య. అద్భుతమైన యకషగానం. యక్షగాన కళాకారులకు ప్రామాణిక ప్రతిని అందిస్తున్నారు బావుంది. మన తెలుగు భాషకు మన సంప్రదాయానికి చాలా మంచి సేవ చేస్తున్నారు. మన సంస్కృతి సుసంపన్నమైన, ఇట్టి కళలను కలకాలం నిలబెట్టే మీ యత్నం సఫలం అగుగాక. భగవతుడు మీకు సకల మేళ్ళు సమకూర్చు గాక.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు సార్. నా రాముడి దయ మరియు మీ ఆశీస్సులు...

      తొలగించండి