శ్రీ శివ పురాణము
ద్వితీయాశ్వాసము - గౌరీ జననము
వచనం: అన శివపురాణ కథ ప్రసంగమిపుడా మునులు జేసిన ప్రశ్న యేటువలెనుండెను.
చం||ఘనముగనిట్లుగాను తమ కర్ణములన్న మృతంబుగుర్వగా
వినివిని తృష్ణ తీరికను వేసటలేక కథానురాగులై
ఆనలమునందు సంసి మరి యాసతి యేగతి చెంది పోయెనో
అనియటు శౌనకాది మునులంతట నడ్గగ సూతుడిట్లనెన్
యాలలు:
యెంతటి ధన్యులోకాని ఈలాగు మమ్మడుగుటకు నెం
త సుదిన మాయేనో నేడు వో మౌనులారా!
ఎట్టి పుణ్యమ్ము లీడేరేనూ
వింతగా గౌరమ్మ జనన విభవము నేజెప్పలేను
కొంతపట్టు వర్ణించెదనయ్యా వో మౌనులారా!
కోరి వినుడీ సావధానులై.
ద్విపద:
యేడు వార్థులలోన యేడు ద్వీపములు
నేడు యీ భువిలోక నిలయాన గలవు
అవనియా మేరున కట్టి దక్షిణంబై
లవణజలధి నుండు లక్షయోజనము
పరగజంబూద్వీప పరగంబు నిదియు
పురుషార్థమిచ్చు ఈ భూమిలోపలను
హిమవంతుడని యేటి ధీపేరు గలిగి
రమణ గిరులకు నెల్ల రాజయియుండె.
కీర్తన - 31:
రాగం:పూరి తాళం:ఏక
హిమవంతుని వైభవవిస్తారము లెన్నతరముగాదే
యీమనుజులకిది పొందరాని దేవేంద్రుని నందనవనమున మించిన ||హిమ||
సమభూమియనే ధేనువరాణికి చంటిలేగవలెనే
క్రమముగ పూర్వాపరసాగరముల కలసుకొనా కాశముతగులాడగ ||హిమ||
గంధర్వులు రత్నపురంబులు గాయనములుగేరా
అందముభాసిలుమణిగుహలందలి అమరులు దంపతులైవిహరించెటి ||హిమ||
మ్రోయుచు పారేటి నిర్మలనదులను మునులు తపము సేయ
రేయుబగలు కాంచనమయ భూములు లెక్కలేని మణిజ్యోతులువెలుగగ ||హిమ||
అమితముగా ఫలపుష్పాదులతో వృక్షములు చాలగలిగీ
ఘుమఘుమ పరిమళవాయువు విసరగ కొలనులపై తుమ్మెదల్లల్లాడగ ||హిమ||
పాయకహంసల సింహాదులు మణి పన్నగములు మెదులా
శ్రేయమలర మంథెన్న ఉమాపతి శిరమున గంగాధారలు వడయగ ||హిమ||
సీ|| ఆ శైలపతి దివ్యాంతఃపురమునందు
మణికల్పతము దైనమందిరమున
కందర్పునింబోలు కాయంబు ధీర్తిల్లు
వింతైన దాసీలు వేయగలిగి
సర్వలక్షణశీల సంపన్నురాలైన
పణతిమేనక దేవి భార్యగలిగి
అన్యోన్యప్రీతిగా నైశ్వర్యములనెల్ల
భోగింపుచుండిరా పురమునందు
గీ||అపుడుమేనక సంపత్తులన్ని యుండి
సంతతియులేని వ్యాజ్యముచాలగలిగి
పట్టుదొలగని ధృఢమైన భక్తిచేత
కోరకలనిచ్చు జగదంబ కొలువుజేసె
యాలలు:
మ్రుక్కుచు వేడుచు బహుగా ముమ్మాటుల
పూజలుచేయుచును పెక్కుకాలమారాధించంగా
వో మౌనులారా! ప్రేమజేసెనపుడైనాదేవి
వ్రతముమెచ్చి ప్రత్యక్షంబై వనితవరములడుగూమడగ
అతివరో నీ వంటి తనయాను వో మౌనులారా!
అడిగితి నిమ్మనుచు పలికేను.
ద్విపద:
ఆలాగెనిత్తునని ఆ మదేవి పోంగ
మైలననెలదప్పె మేనకాసతికి
అసయించుకొనుచుండు నన్నపానములు
ఇసుమంతజవలేక ఇగురాకవలెను
పండునీరెక్కి బహుకోర్కెలెచ్చె
గుండుకుచఘనముల్ ఘనముగానైన
ఝడియుచు సొక్కుచున్ జాగునీరీతి
గడిపి తొమ్మిదినెలలు కలికి నీళ్ళాడె.
కీర్తన - 32:
రాగం: ముభారి తాళం:ఆట
అవతారించేనమ్మా శ్రీ మహాదేవి ||అవ||
శివవిష్ణులనుగన్న శ్రీ మయాపరశక్తి
స్వవశముగ బుట్టి సతిరూపంబును దాల్చి
యెవరిభాగ్యమోగాని హిమవంతుని యింట
భువిలో మేనకదేవి పొలతి గర్భమునందు ||అవ||
నవరత్నగృహమందు నాతి ప్రసవముగాంగ
వవిధోపచారములు వెలదులు సేయంగ
అవనికతో పరిమెళాదూల నెగజల్లి
నవకోటి శక్తులు నటనహారతులివ్వ ||అవ||
పవళించి భూమిన బాలాభావమునొంది
జవరాలు జేతులు జప్పరించుచునోట
కువలాయమ్ములవంటి గురుతు కన్నులుదెరిచి
యువతి జనులవలెనె ఉంగ్యా ఉంగ్యాయనుచు ||అవ||
సువర్ణపుష్పములన్ని సురలు వర్షింపంగా
స్తవముజేయుచు మునులు తపసులు దీవించ
ధవళశంఖులుభేరి తాళాలు మ్రోయంగఁ
గవయులైనాట్యములు గంధర్వులాడగ ||అవ||
అవనిభారముమాన్ప అసురులు బెదురంగ
దివిమండలము నాల్గు దిశలు ప్రకాశించ
రవిచంద్ర తారలు రంజిల్లు వెలుగంగ
భవనమున శర్కర పంచి పెట్టెటి వేళ ||అవ||
ఆశ్వీజ శుక్లాష్ట మ్యర్థరాతిరి వేళ
శాశ్వతంబుగనిట్లు జన్మించి మంథెన్న
ఈశ్వర రాణియా హిమవంతుని యింట
భాస్వరమైయెంతో భాగ్యమీడేరగ ||అవ||
గీ||అతివలెందరు బాలెంత నరసి జూడ
కాంతికిరువది దినములై గడువగాను
చొక్కమైనట్టి యెడల శుద్ధి చేసి
బాలికను దీసి చూచిరా పణతులపుడు.
యాలలు:
అగరుగంధతైలంబున అతివకభ్యంగనమాడించి
మగువ కండ్లకాటుకను దిద్ది వో మౌనులారా!
మంచి వొక్కబొట్టనలదీరీ
రంగైనతొట్లెగావించి రమణులు సామ్రాణివేసి
సంగతిగపాలు గుడిపించి వో మౌనులారా!
సతిని పవ్వళింపజేసిరి.
ద్విపద:
ఆదినంబునలక్ష్మి యా వాణిదేవి
యాదరంబున భూమి యాకాశవాణి
పామరంబున ఋషి భార్యలందురును
దేవిశచి మొదలైన దేవతాసతులు
పొంగుచువచ్చిరి పూజలనొంది
బంగారు తొట్లెలో బాలికను జూచి
ఆముకొపార్వతి యని పేరుపెట్టి
భామలందరు జోల పాడిరిట్లనుచును.
కీర్తన - 33:
రాగం:ఘంటారం తాళం:ఆట
లాలిగౌరమ్మ! లాలి గౌరమ్మ !
లాలిముద్దుల తల్లి బాలగౌరమ్మ ||లాలీ||
యాలలు వినుచు రత్నాలావుయ్యాలలో
పూలపాన్పున నిదుర బోవె గౌరమ్మ ||లాలి||
దయగలిగి సృష్టికి త్రైమూర్తులను కార్య
నియతుల జేసిన నెలత గౌరమ్మ ||లాలి||
ప్రియురాల వేనక ప్రీతి భక్తిని మెచ్చి
నయముగ బిడ్డవైనావె గౌరమ్మ ||లాలి||
భయములు మాన్పుచు పాప రాక్షసులాను
లయము చేసినలోక రాణి గౌరమ్మ ||లాలి||
క్రియలు జేయుచు నానా కృతులైవిశ్వమునిండ
నియతముగ రూపులు నీవె గౌరమ్మా ||లాలీ||
ఒనర మంథెన్నలొ యోగులూ ధ్యానించె
ఘన ఓంకారమునీవు గదవేమాయమ్మ ||లాలీ||
మ||అనియాబాలికనిట్లు బాడిబహుగానా శైలదాంపత్యులన్
ఘనలైధన్యకృతార్థులైతిరి మహత్కార్యంబు సిద్ధించెనో
యనియీలాగున సన్నుతించి బహుమాన్యం బొందుచున్ వేడ్కతో
చనిరా దేవవరాంగణా మణులు స్వస్థానంబులంజేరగన్.
వచనం: అట్టి బాల్యావస్థ గిట్టి నా హైమావతి కౌమారదశ యెటువలెనుండెను.
యాలలు:
మేరగానా బాలదేవి మెడలు నిలిపే మూడోనెలన
ఆరు నెలలా కంబాడానేర్చే వో మౌనులారా!
యేడాది కేనడువ నేర్చేను
మగువకు మూడేండ్లవరకు మాటలన్ని ఆడవచ్చె
తగినపనులైదేండ్లకు వచ్చే నో మౌనులారా!
తరుణి కురులు ముడవ నేర్చెను.
ద్విపద:
పొలతిమేనకదేవి దాన్ని ప్రొద్దునలేపి
కలికి ముఖపద్మమున గడిగి జలమునను
బంగారు జలతారు పరికిణిగట్టి
రంగైనరత్నాల రవికను దొడిగి
అందాలా చాకట్లపుడు సవరించి
తేటపాపటదిద్ది తిలకంబునలది
బోటికద్దము జూపి పొలది ముద్దాడె.
కీర్తన - 34:
రాగం:నీలాంబరి తాళం:ఏక
యీలాగున శ్రీ హిమవంతుని యింట నెదిగెను గౌరమ్మ
చాలగ గార్వము వడయచు లీలలు సేయనెమాయమ్మా ||యీలా||
తామసమున తల్లి యసహించెటి వేళ తండ్రి దగ్గర జేరు
ధూముసేయకుమని అదలించి తెకండ్ల తోయబిందులెకారు ||యీలా||
ప్రేమతో మేనక పైడి తట్టలొబువ్వ పెట్టి బ్రతిమిలాడు
కోమలిరుచులను కోరుచు భుజియించి కోపము విడనాడు ||యీలా||
భామిని యింటికి మౌనులురాంగనె పాదములకు మ్రొక్క
గ్రమము వనమృగ పక్షుల జూడశృంగార సౌధములెక్కు ||యీలా||
లేమరత్నాలయిసుకుదంపుచు చెరుగుచు లేనివంటలు జేసు
కామినులగూడి బొమ్మల పెండ్లిండు గావించు సొగుచు ||యీలా||
ఆ మగువలతొ సయ్యాటలాడుచు నుయ్యాలనూగుచును
పామరమున మంత్రపురి నాథుని మీద పాటలు బాడుచును ||యీలా||
మ||హిమశైలేంద్రుని మందిరమున భవానీ దేవి పెంపొంది సం
భ్రమమైయుండగనంతలో విధి నీ బ్రహ్మండ భాండంబులా
రమణీయంపుర సాతలంబున మహా ద్రక్షోగణాధ్యక్షుడై
తమస శ్రేష్ఠుడు తారకసురుడు నా దైత్యుండు జన్మించెఁబో
యాలలు:
క్రమముగా పెంపొందుచును భార్గవుని యుపదేశము
వలన అమితమైన తపము చేసెను ఓ మౌనులారా!
అప్పుడజుడు ప్రత్యక్షమయ్యెన్|
మెచ్చివరములెన్ని యిచ్చి యెత్తిజెప్పుమన్నంతలోన
యెచ్చుగాదానవుడై యూహించి యో మౌనులారా!
యీశతనయునిచే మృత్యువుగోరెన్
ద్విపద:
మాబానుచు పితామహుడుపోంగాను
ఆ బాలకుడు లేచి అసురపురమేగి
గురుమంత్రి సైన్యముల్ గూడుకొని చాల
పరగలోకములన్ని పట్టి సాధించి
యెల్లదేవతలను హింసించగాను
ఘోల్లున దేవతలు గూడి జంభారి
గ్రక్కున సత్యలోకము జేరబోయి
మ్రొక్కి పరమేష్టికి మొరబెట్టసాగె.
కీర్తన - 35:
రాగం:ముభారి తాళం:ఏక
అరయాదండములు మీకు హంసవాహన!యికమా
తరముగాదయ్యాశార దంబమోహనా ||అర||
పాపితారకుడు భూమి భారమాయెనూ,ఒక్క
యేపునదనుజబలము హెచ్చిపాయెనూ ||అర||
దాఫైయన్యాయమెంతో దండిదాయెను,
వాని ప్రాపునదిరిగేటీ మా బ్రతుకులాయెనూ ||అర||
యిప్పట్లమునులకెంతో యిట్రమాయెనూ
కర్మవ్యపారముడుపుమాని అదపులాయెనూ ||అర||
యే పని చేయవలె మే మెందు బోదుము
మమ్ము ఈ పాటీ గావకున్న యెవరివారమూ ||అర||
ఓపీ మంథెన్న స్వామి వోడిపాయెను జగమూ
కాపుగాచేటిమాటి కల్లలాయెనూ ||అర||
వచనం: అని యాపన్నండైన పురంధరుని మొరాలించి బ్రహ్మ యేమనుచున్నాడు.
సీ||వాసవోత్తమవీడు వరములొందినవాడు
కాలాంతకుని రీతిగన్న వాడు
దారపుత్రులు లేరు ధనయవ్వనములేదు
వెనుక దక్షత లేదు వెర్రివాఁడు
అని తలచి దానవుండతని పుత్రుని చేత
అంత్యంబుగోరి నన్నడుగగాను
అపుడివ్వబడెను పాయంబేమి మరిలేదు
కేశవుండైనను గెలువ లేడు
గీ|| ఇపుడు వినరయ్య మీకొక్క హితవు గద్దు
శ్రీఘ్రమునబోయి గిరిరాజు చిన్నదాన్ని
శివునికొన గూర్చి లగ్నంబు చేయగాను
బాలుడు దయించి మీ పీడబాపగలడు
యాలలు:
దేవనాథుండాదేవతలు తీవ్రంబున హేమాద్రి గుహలో
భావికార్యార్థులై యరుదెంచీ ఓ మౌనులారా!
బాగుగా నచ్చట దాగుండిరి
నారదార్యునాహ్వానించి నానోపాయంబుల నూహించి
ధీరుని నా హిమవంతుని గూర్చి ఓ మౌనులారా!
తెరువుజేసి తోలించంగాను
ద్విపద:
అంతట గిరాజు అంబికను గూర్చి
యింతిమేలైన పెండ్లీడుగలదాయె
యెవరికిత్తునటంచు యెంచి చూడంగ
దివినుండి దేవర్షి దిగ్గునరఁగ
వందనాంతరము దివ్యాసనమిచ్చి
అందముగాను పూజాభివాదమిది
సురమౌనితోనిట్లు జోలి తెల్పంగ
పరమసంతోషాన పలికెనాతండు.
కీర్తన - 36:
రాగం: నారాయణ తాళం:ఏక
ఎంతోధన్యువోయి హిమశైలరాజా! వోహిమశైలరాజా!
శ్రీ మంతుడవేసుమ్మి మార్తాండతేజ ||ఎంతో||
మునుపుదక్షునికన్య మూర్ఖంబువలన చాలా మూర్ఖంబువలన
మునియాగకాలమువలన ముగిసేనాలలస ||ఎంతో||
వనితాదుఃఖముచేత వామాదేవుండు ఆ వామదేవుండు
ఘనమైన తపమందు గదసీయున్నాడు ||ఎంతో||
వెనుక నీ సుకృతము వెలసినదంట చాల వెలసీనదంట
తనయురాలైగలిగి కేదా నొప్పెన చెలియా ||ఎంతో||
జననీ గర్భమునందు జగమూలు వెలయ మూడు జగమూలు వెలయ
నొనరశంకరుని కేదా నొప్పెన చెలియా
||ఎంతో||
విను మంత్రపురిసామికి వెలదినియిమ్మ నేడీ వెలదినియమ్ము
చనువుగ నామాట సత్యముగా నమ్ము ||ఎంతో||
గీ|| అద్రిరాజుకునిటు జెప్పి యమరమౌని
రాణివాసముకేగి సౌరంభియగుచు
పట్టి సర్వాత్మికను జూచి భక్తినొంది
యిమ్మడించి తనాత్మలో నిట్లు తలచె.
వృత్త శ్లోకములు:
పరబ్రహ్మ కల్పాది బీజాంకురాం
పరామ్నాయకాంతార సారంగిణీం!
హరీశాత్మయోనిం పరమాంబికాం
భజే భక్తలోకైక చింతామణీం! ||1||
సునీహార గోత్రోధ్వబాం భామీనీం
నిజావాస కైలాస సౌధామినీం
స్వనాధశ్చ వామాంక పీఠేస్థితాం
భజే భక్త లోకైక చింతామణీం! ||2||
సురాకా శరశ్ఛంద్ర బింబాననాం
సరోజా భనేత్రీం సులీలాలకాం
సుధాసింధు వీచీవ మందస్మితాం
భజే భక్తలోకైక చింతామణీం! ||3||
మహానీల నీలోత్పల శ్యామలాం
నసాదృశ్య నర్వావయవ సుందరీం
రమాద్యంగనాభిః కృతాలంకృతాం
భజే భక్తలోకైక చింతామణీం! ||4||
కరాబ్జేర మోఘాయుధస్సుందరీం
బలేదుర్మదానేక సంహారిణీం
సదాభూతనఘైశ్చ సంసేవితాం
భజే భక్తలోకైక చింతామణీం! ||5||
అనాద్యంత సౌభాగ్య సంవర్దినీం
భవద్వాంతహారార్క సంకాశినీం
త్రివేదాంత ఓంకార మంత్రాత్మికాం
భజే భక్తలోకైక చింతమాణీం! ||6||
సితామగ్రతోజాత కల్పద్రుమాం
సుశీలాంచదీనాంచ రత్నాకరీం
సురానాం మునీనామభీష్టప్రదాం
భజే భక్తలోకైక చింతామణీం! ||7||
ఇతి శ్రీ మహాహంత్ర కూటేశ్వరీం
యజేదివ్య వాక్పుష్టితా మంజరీం
పయోస్తరీం దేవరాజ్యప్రదాం
భజే భక్తలోకైక చింతామణీం! ||8||
చం||అనిన మహర్షింనింగనుచు నాగిరికన్యక మ్రొక్కి వేడుచున్
ఒనరగ పూజజేసి తన దొక్కతలంపున పృచ్ఛచేయగా
ఘనుడు మహాత్మురాలిమది గైకొని యాసతి భక్తిగ మ్యునిన్
వనితకుజాడదెల్ప సురవర్యుల శీఘ్రము జేరగా జనెన్.
యాలలు:
అంబికాదేవి యంతాలో హరుని సాన్నిధ్యముకే తెంచి
సంబరమున ప్రాణేశునిజూచి యో మౌనులారా!
చాల భక్తి గలిగి మ్రొక్కేనూ
దినదినా మీరితి గౌరి దేవి పూజజేసి పోంగ ఘనుడు
శంబుడి సుమంతైననూ ఓ మౌనులారా!
కానడు బ్రహ్మానందమువలనా
ద్విపద:
అమరాధిపునిజేరి యానారదుండి
విమలుడీవిధమెల్ల వినిపించగాను
మంచిదని పృత్రారి మన్మథున్జూచి
యెంచి సహాయము లిడి బ్రతిమాలి
కాలకంఠునిజేరి కాచుకోనియుండి
బాలపార్వతి మీద భ్రమనొందజేయు
మనుచు సురపతి పయన మంపేటివేళ
కనుగొని కాముని కాంత యిట్లనియె.
కీర్తన - 37:
రాగం: ఘంటారం తాళం:ఏక
శంకరుని తెరవుబోకుమా మోహానరాజా ||శంక||
యింక ఈలాగు బుద్ధినీ కెవరు జెప్పిరయ్యయ్యో!నీ
మంకుబుద్ధి మరువజాలవ మోహనరాజా ||శంక||
డంబవేషాధారీగాడు ధర్మమూర్తి ఆదిగురుడు
అంబతోనే డెట్లుగూడి నీ మోహన రాజ ||శంక||
కుంభిణీపై మాయలన్ని కౌరితానై కల్పించనూ
శంభుడు నీ మోసమయ్యీనా! ||శంక||
సంగరమున త్రపురములు చయ్యనకాల్చివేసిన
సాంబశివుని ఖ్యాతి వినలేదా!మోహనరాజా! ||శంక||
డంబముగాదు నా మాట శరణుయిదిగోమన్నించు న్యా
యందు గాదు నీకునాతోడు మోహనరాజా ||శంక||
అంబుజాక్షు మంత్రపురీశు డన్యుడావనుకుంటివేమో!
బింబసాక్షియగుట యెరుగవ మొహనరాజా ||శంక||
మ||రతియిటెంతయు జెప్పినన్ వినక మూర్ఖంబొంది యామన్మధుం
డతిగర్వించి వసంత మధవునిలో నావేళతా వేళ్ళుచున్
శితికంఠున్ని పుడేమహామహిమచే స్త్రీలోలునింజేసి యా
వ్రతనేమంబున భంగపుత్తునని యా ప్రాంతంబునం జేరినన్
యాలలు:
నర్రమాను పొదరిండ్లచే నానాజాతిఫలపుష్పములన్
విర్రవీగు మృగపక్షుతోనూ ఓ మౌనులారా!
వీచుచుండె మలయనిలమందు
ఘనుడుకు సుమాకరుడీరీతి కానివేళందైనాగాని
మునులకైనా హెహంబయ్యేటి ఓ మౌనులారా!
ముద్దుగారావనముంగల్పిచెన్.
ద్విపద:
యపుడు శంభుని యా మన్మధుండు
చపలుడు గాడేమి చేయుదననుచు!
చెఱుకు విల్లునపుష్ప శరము సంధించి
గుఱిగాచుకొని వెన్క గూర్చుండగాను
అంతలో నొక్కనా డాగేరిదేవి
సంతసిల్లుచు నిజ స్వామిని జేరి
పొలతివినయము చేత పూజించువేళ
యెలమినొందకయప్పు డీశుండుజూచె.
కీర్తన - 38:
రాగం:పూరి తాళం:ఏక
చూచెను గంగాధరుడు శ్రీ రాణిని ||చూచెను||
ఆచరించిన చిన్ని యవ్వనమువలపు
లేచ్చినవ్వేటి చేలిని శ్రీ రాణిని ||చూచెను||
రాక చందురునిబోలు రమణి మోమున ముద్దు
లోచనంబులదానిని శ్రీ రాణిని ||చూచెను||
గోచరించిపుచుచుండె కుచగిరులందు సరులు
ఊచి అల్లాడే సఖిని శ్రీ రాణిని ||చూచెను||
చాచిన హస్తములు చరణములిగురాకులై
తోచినసుందారాంగిని శ్రీ రాణిని ||చూచెను||
కాచిన పైడివలెను కళలుగలిగిన మేన
దోచిన సిగ్గులాడిని శ్రీరాణిని ||చూచెను||
ఖేచర భ్రమరముల గెలిచిన కొప్పుగలగు
రాచ మంథెన్నదేవిని శ్రీ రాణిని ||చూచెను||
మంజరీ ద్విపద:
ఇట్లు జూచిన వేళ ఈశ్వరుని పైన
విరిశరుండప్డుబాణము విడువగాను
ఆదిగురుండైన మోహము నధికమొంది
పడతి హస్తంబు తనచేత బట్టెనపుడు.
యాలలు:
ప్రాణసఖురాలిని గూడుటకు బాగుగా వేళాయననుచు
జాణరోరమ్మాని తొడమీదా వో మౌనులారా!
సఖిని గూర్చుండా బెట్టుకోనీ
యేమిరా!యీలాగుబుద్ధి యెవడు చెరపేనని
వూహించి కోమలాంగినపుడై విడనాడి ఓ మౌనులారా!
కోపమొంది దిశలన్నిట జూచెన్
ద్విపద:
విరహకంటకుడట్లు వేగానజూచి
హరమూర్తినిటలాక్ష మదిదెర్వగాను
ప్రళయానలముబట్టి పారేటివేళ
బలువైనకాముండు భస్మమైపోయె
పసలేకరతిదేవి పడిమూర్చబోయె
కుసుమ శరుడు భీతి గొని పారిపాయె
అపుడురుద్రుడు మాయమైనంతలోన
చపవయై గౌరమ్మ నఖులకిట్లనియొ
కీర్తన - 39:
రాగం:తోడి తాళం:త్రిపుట
చెలియారోనే నేమి సేయుదునమ్మా!
అలనాకోరికవ్యర్థా మాయనుసుమ్మా! ||చెలి||
అపరాధమ్ముల యేమే మాయనుగదనే
డిపుడు ముందరిబుద్ధి కేమి చెప్పుదునే ||చెలి||
అపచారి మరుండిందు యాలవచ్చెనుహా
నెపమునామదికెంతో నేరమాయనుహా ||చెలి||
విఫలమైన కర్మ వేగమువలన
త్రిపురారినెడబాయు తీరాయలలనా! ||చెలి||
చెపులాక్షినాకు యీ జన్మ మేలనే
లపకీర్తి బలుమోహ మాయెనూ తాళానే ||చెలి||
కృపదప్పి మంథెన్న కేగనే ప్రియుడు తపమున సాధింతు దైవేశునిపుడు ||చెలి||
గీ|| ఇట్లు దుర్గాంబ చింతించి హిమగిరందు
కురులు జడదాల్చి గంగోప కూలమునకు
చేరికాంతారముననొక్కి చెట్టుక్రింద
కాయశోధనగొని వీరకాసెబూశె.
వచనం: అప్పుడా గిరికన్యక యేమి సేయుచున్నది.
యాలలు:
బాగుగా లింగము గావించి పద్మాసనమందున గూర్చుండి
నాగభూషనుని యాహ్వానించి వో మౌనులారా!
నానావిధములను పూజించెను
తల్లి,యిల్లు మొదలైనవి తలువరోసి పరరమేశ్వరుని
నుల్లమందుపతినిగా గోరి వో మౌనులారా!
యుగ్రతపము నాచేరించేను
ద్విపద:
స్థిరముగా గూర్చుండి చిత్తమునిలిపి
కరములు జోడించి కన్నులు మూసి ధీరచేకొని బాహ్య దృష్టింతలేక
గౌరియిట్టుల దీక్ష గలిగియుండుగను
అంతలో రతిదేవి యావనమందు
వింతమూర్ఛనుదెలసి వేగమేలేచి
పతిజాడకేతెంచి భస్మమునుజూచి
అతిఖిన్నురాలగుచు నతివయిట్లనియె.
కీర్తన - 40:
రాగం:ఆరభి తాళం:జంపె
యేమిసేతునమ్మా!అయ్యయ్యో!
నేనెందుబోదునమ్మా! ||యేమి||
పామరము గల్గునా భర్త నెడబాసినిక
యేమనుకుందునే నెట్లుతాళుదునే ||యేమి||
భీతునెరగించగా ప్రియుడిటు వచ్చెను
ఖ్యాతియగు కారణము గానున్నదేమోనే ||యేమి||
నాతినొకగూర్చుట న్యాయమాయెనుకాని
ఘాతకుడు రుద్రుడీ కర్మమెటు జేసెనే ||యేమి||
పాతకుడు బ్రహ్మణా పాపమేమి జూచెనో
ఈ తీరుగాను ఫలమేలాగు వ్రాసెనే ||యేమి||
యేతెరువుబోదునే నెవరికి మ్రొక్కుదును
నా తల్లి వ్యర్థముగా నన్నేలగనెనే ||యేమి||
మాతరోనాయిది మంచి దశగానిదై
చాతరుడు మంత్రుపురి స్వామిదయదొలిగెనే ||యేమి||
సీ|| అని ఇట్లు రతిదేవి యారాటపడగాను
యావసంతుడు మేరువపుడు జేరి
వెనుకవృత్తాంతము వినిపించినంతలో
శచినాయకుడు బృహస్పతిని జూచి
యింకయు పాయంబు నెరిగించుమనగాను
సురమంత్రియది బారజూచి పలికె
దక్షయాగమునాడు ధవళాంగనకు మీరు
ద్రోహంబు జేసిన దోషమిదియె
గీ||తప్పు పనివల్ల కార్యంబు తగులబడియె
యిప్పుడేమైన మన వంశంబింత లేదు
ఇకను దానవులందునందీశ్వరాజ్ఞ
అనుభవించక తీరది దనచు బలికె
యాలలు:
అప్పుడా నీరదవాహనుడు అగ్ని మొదలైనా దేవతలు
కుప్పగూడి రతిదేవిని జూచి వో మౌనులారా!
కోమలాంగిని బహుగా లాలించి
ప్రాకటముగా విభుడు నిన్నూ పాయకా యెప్పటి రీతినను
నీకుజూడ గలిగి యుండులా ఓ మౌనులారా!
నెలతకిట్లు వరములిచ్చిరి.
ద్విపద:
వనితాదుఃఖము మాన్పి వజ్రాయుధుండు
గునిసి బృందారకుల గూడ్కొని లేచి
అమరవైలముజేరి రంతలోపలను
హిమవంతుడావేళ ఇల్లాలుతోను
పార్వతికింటిరాక పాయనేయంచు
నోర్వజాలకయట్టి యూరెల్లజూచి
కదసి గుహాడువుల్ గట్లన్నిగాంచి
సుతతినోవనమందు జూచియిట్లనిరీ.
కీర్తన - 41:
రాగం:కన్నెడ తాళం:ఆట
రావెగౌరి లేచిరావే అమ్మరావే తల్లి లేచిరావే ||రావె||
యీ వేళ నీకిట్లు యెవరు చెప్పిరొకాని
గావరయ్యేవుయెండ గాలివానల చేత ||రావె||
మేడలన్ని చిన్నబాయె యేమి వేడుకున్న లేనిదాయె
యేడుదాలెన్నెన్నొ యేనంగ బాయెను
నేడు నిన్నెడు బాసి నిము సమోర్వగలేము ||రావె||
తోడు చెలలు మెచ్చుకోరె నిన్ను జాడ గొనుచు వచ్చినారె
యీడువారిని గూడి యాడుచుండగ మేము
జోడు కన్నులనిండ జూడలేదిన్నాండ్లు ||రావె||
చూడవొక్క బిడ్డవమ్మ మమ్ము యేడుపించవద్దు సుమ్మ
తాడానమైనట్టి తపములు నీకెల
యేడు ద్వీపములొక్క డేలే పురుషునికిత్తు ||రావె||
పాడుదైన అడవియందు తోడునీడలు లేరు యేమనందు
పీడాలు దానవులు పేరైన మృగములు
యేడ భక్షించునో యేమి సేయుదుమయ్యయ్యో ||రావె||
కీడు బుద్ధి విడువరాదు యెంత వేడుకున్న జాలిరాదు
చెడెరో మంథెన్న శివుని గోరివివేమొ
ఆడదానవుదేవుడతడేల నీ వేడ ||రావె||
గీ|| తల్లిదండ్రులు నీలాగు తరచుగాను
బ్రతిమిలాడిన యెంతైన పలుకుదనుచు
గౌరి మహిమను ప్రేమచేగానలేక
సోదకులగూడుగొని తెచ్ఛిజూపిరపుడు.
వచనం: మరియా మేనకాహిమవంతు లేమనుచున్నాడు.
దరువు - ఆట:
ఎన్నడు జన్మించె
ఎన్నడు చిన్నెలు నేర్చె సాములారా!
ఎన్నిటగలదోషమేమి
గూడెనొగాని సాములారా!
కన్నవారలము మా
కర్మమే మనవలెనే సాములారా!
ఎన్నరానిదీ మాయా
యేమిసేయుదుమయయో సాములారా!
వచనం:అట్టి విచక్షణులేమనుచున్నారు.
ద్విపద:
అపచారమేమైననది గానరాదు
ఇపుడు దీనికి చేటొకింతేనినేదు
బహుమాయమునుగాదు భేషజములేదు
గ్రహదోషములయొక్క కపటంబుగాదు
దేవకుటిలముగాదు తాటోటిగాదు
దేవితపముజేయు తీరుగాబోలు
సంకల్పమేమైన సాధించుగాక
శంకనొందుచు మీరు రుఢియబోకుండి
వచనం: అనవిని మరియా మేనకా హిమవంతు లేమని చింతించుచున్నారు.
కీర్తన - 42:
రాగం:ఘంటారం తాళం:జంపె
యీలాగు గౌరమ్మ నిందువిడనాడి మే
మేలాగు పోదుమమ్మా! కొమ్మా!
జాలిమానదు ఏమి చక్కిదోచదు మాకు
సంపత్తుతేమీచేయా రోయా ||యీలా||
పట్టినోములు నోమి బహుకష్టపడి యెంతో
ప్రార్థించి వేడుకంగ రాంగా!
గట్టిగా దైవంబు గాచివరమివ్వంగ
కలిగె నేముద్దు చెలియా వెలయా! ||యీలా||
పెట్టిగారాబమున పెంచంగ పెంచంగ
పెరిగే నీ వెర్రిగోలా బాలా!
రట్టడింతయుగాదు రాచకూతురుమంచి
లజ్జగలమానవతినీ సతినీ ||యీలా||
దిట్టగాదుకలికి తృష్ణకోర్వగలేదు
దేవి పసిలేతకోమ్మా సుమ్మా
కట్టుముట్టడిలేని కాననంబునింత
కష్టంబుకోవగలదా వలదా! ||యీలా||
చుట్టుగాచుకొయున్న సురలారతరులారా!
చూడుడీచిన్నదాన్నీ దీన్ని
నట్టింటినైన యెన్నడు మమ్మువిడలేదు
నా తల్లి బుగులు గలదీ వెలదీ ||యీలా||
పట్టి ఆబలను ముందు వలపించి ఈలాగు
వడికొల్ప దలచి నావా దేవా!
గుట్టుగల మంథెన్న గురుదైవరాయున్ని
కోరవద్దనగవిదయా కనదూ ||యీలా||
సీ||ఆమేనకాదేవి యచలేంద్రుడీలాగు
చింతించి వేసారి చిన్నబోయి
తమ బిడ్డ భారంబు దైవమందునవేసి
చాల మ్రొక్కుచునిల్లు జేరబోంగ
అతిఘోర తపమునే యాదేవిసేయంగ
పెరిగె పుట్టలు చెట్లు పెక్కుగాను
స్థానమృంగంబులా సన్నిధిన్ జేరి
యూచిదేహములేల్లరాచుకొనుచు
గీ|| ఖగములొంటనువ్రాలి చెం గలమునొంద
సర్పములు మీద బ్రాకిన ఝడుపులేక
వాయుహారముచేమేను వడలిపోంగ
గడపెనీరీతి గొన్నాళ్ళు గౌరిదేవి
యాలలు:
సారెకును మేదిని కంపించి స్వర్గమ్మును ధూమ్రముగమ్ముచును
హరిరాసు లుడుకా బట్టేను వో మౌనులారా!
వహ్నికొడలూర్ధ్వపురంబులకేగెన్
అంతట కైలాసాగ్రమున హరుని మనసు చెదురుకోంగ
చింతజేసి గిరికన్యనుజూడ వో మౌనులారా!
శీఘ్రముననై పోదామని తలచెన్.
ద్విపద:
గూడకాశనుగట్టి గుజురూపమున
తోడకృష్ణాజినము దొంతి శిఖనొంది
తగుభస్మధారియై దండంబబూని
జగదీశుడొక బ్రహ్మచారియైవచ్చి
గౌరమ్మనే మంబుకండ్లనేజూచి
యీరీతి తపము మేమెన్నడెరుగము
అని మదిని తాచాలయాశ్చర్యమొంది
వనిత భావము జూచి వలచి యిట్లనియె
కీర్తన - 43:
రాగం:పూరి తాళం:ఆట
హరునిగోరకు సుమ్మి పార్వతి
నీకందముగాదేవో పార్వతి
పరమావృద్ధుని యందు పార్వతి
యింత భ్రమసితి వేమందు పార్వతి ||హరుని||
నీవు చూచెటందుకు చిన్నదానవే
మంచిసొగసైనవొయ్యారి జాణవే
వాసికెక్కిన మందయానవే
దొడ్డవారి పిల్లవు మేలుగానవే ||హరుని||
వాడు గ్రసమింటను లేక వక్కునే
వలువ గట్టకముదిమేను సొక్కునే
రోసిన ముసలెద్దునెక్కునే
పుర్రెలోనబిచ్చపు కూడు మెక్కునే ||హరుని||
నేడు వాసిగ యీభూమి ఠావునా
నిన్నువలువక యెవడైన బోవున
కాసారీతిరి యెంతొలావున దొడ్డ
ఘనడైతె యిటురాకపోవున ||హరుని||
దండి దోసకారికి నైదుమూతులే
పులి తోలుగప్పిన పది చేతులే
ఆశాలుడిగిన వెర్రి చేతలే
వాని వన్నియమంగళనీతులే ||హరుని||
వోసి నీ సాటి రాజులగోరవే
వెర్రి నిగిడి యింటికి వేగ జేరవే
పూచి పెట్టకు యెంతో ధీరవే
మంత్ర పురిసామి నెంతైన దూరవే ||హరుని||
గీ||అనుచు విప్రుడు బలుకగా నామృగాక్షి
వీనులనుదాకయోగంబు విశ్వసించి
యొనర నాథుని దూష్యంబు నోర్వలేక
బాహ్మముఖమందు గోపించిబలికెనపుడు
దరులు ఆట:
ఎంత పాపమొగాలి యిపుడీమాట వింటికొమ్మలారా!
సంతాపమతడు నా స్వామిగాదానుకుంటి కొమ్మలారా! ||1||
యింతకాలములైన ఈశుండురాడాయ కొమ్మలారా!
చింతించినే నేమి సేయుదునయ్యయ్యొ కొమ్మలారా! ||2||
ద్విపద:
అని యపుడావటు నసహించుకొనుచు
తనదైన విధివల్న త్రాసంబునొంది
స్వామిచేకొననట్టి చప్పదనమైన
భామరో ఈలాగు బ్రతుకేమి సేయ
చితియమేలని లేచి చింతించగాను
అతివభావముజూచి యార్తరక్షకుడు
ద్విజవేషమునుమాని దేవిముందరను
నిజరూపమును దాల్చి నిలచెనంతటను
కీర్తన - 44:
రాగం:సావేరి తాళం:ఏక
హరుడు ప్రత్యక్షమాయెను గౌరిదేవికి
శంకరుడూ ప్రత్యక్షమాయెను ||హరు||
రాకాచందురుని బోలు రంగైన మేనుగలిగి
శ్రీ కొమరుని గంధర్వులరాయుని
శ్రీ ధరుని మించిన సుందరుడై ||హరు||
తాకి వస్త్రములు మేన ధావళ్యమై వెలుగంగ
ప్రాకటముగ శశి మకుటము నెలకొని
బాలనాగకుండములు మెరయ ||హరు||
కాకచల్లారు మంచి గంథంబు మేనసలది
చేకొని కరములు శూలము పరశు పినాకము
శ్రేయమైన మృగ చర్మముల మర ||హరు||
శోకముమాని గౌరి చూచియానందమొంది
అకడబిడియము నౌదలవంచుకొ
యందమైన ముసిముసి నవ్వునుగొని ||హరు||
సాకారుడై మంథెన్న స్వామి కరుణా సాగరుడై
సోకియలగుచు సరసములాడుచు
చూచి పునికి ముద్దాడుచు నవ్వుచు ||హరు||
గీ||శివుడు పార్వతి హస్తంబుచేతబట్టి
నిశ్చయము నాకు భార్యవు నీవె యనుచు
వనితనెన్నుచు నీలాగు వరములిచ్చి
సప్తఋషులను తలచె నా సమయమందు
వచనం: అట్టి యిచ్చామాత్రంబున సాక్షాత్కారులై మోక్షార్తులేమనుచున్నారు.
కీర్తన - 45:
రాగం: పున్నాగవరాళి తాళం:జంపె
జయభవాని శంకరాయ చంద్రమౌళి యేకృతాంత
భయనివారణాయమాం పాహిమంగళం ||జయ జయ||
అష్టమూర్తయే భుజంగ హారమకుటశోభితాయ
దుష్టదానవాంతకాయ సృష్టిమంగళం ||జయ జయ||
పరమపురుష సారంగ పాణియేదిగంబరాయ
నిరతిశయానంతరూప నిత్యమంగళం ||జయ జయ||
వామదేవాయపంచ వదనకమలశోభితాయ
సోమసూర్యాగ్ని నేత్ర సుపథ మంగళం ||జయ జయ||
విమలముని ప్రేరితాయ వేదవేదాంత వేద్య
కమలనాభ పూజితాయ రమణ మంగళం ||జయ జయ||
భూతనాతమంత్రకూట పురమహాజనాశ్రితాయ
గౌతమీ తీరవాస కలయమంగళం ||జయ జయ||
యాలలు:
తలచి దండంబులుగావించి దేవేశుని
ముందరనిలుచుండి అలవిగా
హస్తములంజలిబట్టి వో మౌనులారా!
ఆఙ్ఞయే మోయివ్వుండనగాను
పుణ్యరాలీవిధమూ తెలిసిపూని
హిమవంతుని యింటికినై కన్యనడుగామునులాదోలించి
వో మౌనులారా! ఘనుడు కైలాసము కేతెంచెను
ద్విపద:
భార్గునిమతమునా ప్రాజ్ఞులొనగూడి
దుర్గింబనింటికై తోలుకొనిపోంగ
ఘనుడు పర్వతరాజు గ్రక్కున లేచి
మునులింటికైరాంగ మురిపెమునజూచి
చాల పూజలు నమస్కారముల్జేసి
యేల వచ్చితిరి మేలేయని యడుగ
పర్వతేశుని గూర్చి బ్రహ్మవిదులనిరి
సర్వదాగౌరిని శంబునికడిగి
క్రమమొప్పబోధించి గట్టి పర్వంగ
హిమవంతుడాలించి యిట్లనిపలికె
కీర్తన - 46:
రాగం: కాఫి తాళం:ఏక
శంభునిదోలుకోనిరండిరండి మునులారా!
రంభనుమించిన గౌరమ్మను యిచ్చెదము ||శంభు||
భాగవతులు మీరు పనిబడిమాయింటికి
తూగివచ్చుటే శుభ హేతు విదేగాదా! ||శంభు||
యీగురి పలన గౌరి యిదివరదాకనుచాల
వేగెను కష్టములు భాధ చెందివుండేనుకదా! ||శంభు||
కాగలా వేడుకలతో గౌరిని పెండ్లాడగా
నాగభూషణులను జూడ నోచిగాడ ||శంభు||
యాగములన్నియు జేసి యాత్రలు దిరుగుచును
యోగమభ్యసించినగాని కానరానీ ||శంభు||
వేగమే మంత్రపురి విభుడు మా అల్లుడైతే
బాగుగా మా జన్మమును సార్థకమౌను చాల ||శంభు||
గీ||శైలరాజేంద్రుడీలాగు చాలజెప్పి
ప్రేమలొనరగ దండంబు పెట్టగాను
అపుడు దీవించి మునులెంతొ హార్షమొంది
శివుని కడకేగిరావేళ శ్రీఘ్రముగను.
యాలలు:
కొండలరాయుడావేళ గొప్పైనా
సంబరము నొంది చండికాదేవి
గౌగిటజేర్చి నో మౌనులారా! జాలినొంది బహుగాలాలించీ
కామితార్థ మైన సిద్ధి గలగెనాని యా
సుందరిని నేమము సంపూర్తి చేయించి
యో మౌనులారా! నేటుగాను సంతోషమొందిరి.
ద్విపద:
అంతట కైలాస మామునులుజేరి
పంతము చెల్లపో పశుపతి యనుచు
మ్రొక్కియా విధమైన ముచ్ఛటందెల్ప
ఫక్కున నవ్వియా పరమేశ్వరుండు
ప్రకటంబుగావేళ్ళ భైరవులదోలి
సకలలోకుల నప్డు సరగఁబిల్పిండి
నగరాజునింటికి న్యాయంబుగాను
సొగసైన శకునముల్ జూచుచువెడలె.
కీర్తన - 47:
రాగం:రేగుప్తి తాళం:ఏక
పెండ్లాడ తరలి వచ్చేనమ్మా భీమేశ్వరుడుపుడు ||పెండ్లా||
కండ్లను జూడ విలాలముమోదము
కలుగుచు శ్రీమన్నారాయణునితో ||పెండ్లా||
గరుడా రూడుండై వేడుకతో కమలాదేవితో
బిరుదుగా శంఖచక్రములమర
అరుదుగ పీతాంబరమున కౌస్తుభ
హారము దివ్య కిరీటము వెలయగ
పురజనులను తమ వెంటను దోడ్కొని
భుజగశయానుండెడుమచు నడువగ ||పెండ్లా||
వరమైన హంస యానమందు వాణీతోపొంగ
మురయుచు సరసములాడంగ మునుల బొగడంగ
యిరుగడ వేదమ్ముల గొనియాడగ
యెర్రని వన్నె శరీరము మెరయగ
కరమున కలశము నాలుగు ముఖములు
కలిగి విధాతయు కుడినను నడువగా ||పెండ్లా||
కరిరాజు వాహనుడై చెలగి కన్నులు వేయిగలిగి
సరిగా దేవతలు గొలువగాను శచిదేవితోను
సురతరువును చింతామణి ధేనువ సుందరులను రంభాదుల నెలకొని
బిరుదుగ వజ్రాయుధమున బూని
అరుదుగ సురపతి ముందర నడువగ ||పెండ్లా||
సిరిగలిగి యక్షులు కిన్నెరలు సిద్ధులుచారణులు
నరులు దానవులు నాగులును అప్సరసలుతోడై
తరుణులు గూడి విమానము నెక్కిముదంబున
తనదగు వొయ్యారము వెలయగను ధీరవరులు పరిజనమున కూడుకొ
దివిజగణాదులు వెంటనడువగా ||పెండ్లా||
విరివిగా నందముగాను సొక్కి వృషభంబునెక్కి
పరిచారులగుచు భక్తులు నిలుప భైరవులు గొలుప
నిరుపమమై శశిశూర్యహుతాశన
నేత్రత్రయమది మోమున వెలయగ
గురిగలుగుచు నాగేంద్రుడు మణులతొ
గొడుగై యుండగ మంత్రపురీశుడు ||పెండ్లా||
సీ|| ఆవేళదేవేంద్రులచలేంద్రునింటికి
శ్రీఘ్రంబు గనుముందు జేరవచ్చి
భూధరాధిపునిల్లు పురమలంకారంబు
కావించె నా విశ్వకర్మవలన
కల్పవృక్షంబుచే కామధేనువు వలన
నిఖిల వస్తువులన్ని నిండుపరచి
ఆ సప్తఋషులనే యాఙ్ఞికులుగ జేసి
దివి నాథుడంతయుం దీర్పగాను
గీ||అపుడు మేనక హిమవంతు డందముగను
బాంధవుల గూడుకొని దిద్దు బాటుంగుచు
నేమమున కులదైవము నిలుపుకొనుచు
నొనర పార్వతి నచ్చోట నుంచిరపుడు.
యాలలు:
మించగా నా దేవేంద్రునితో మేటి బంధు
పరివారముతో పంచ వాద్యంబులు మ్రోయ
వో మౌనులారా! పర్వతేశుండెదురుబోయి
వేడుకతో శూలాయుధుని వినయంబుగా
వేడుకొని చేడెలు నివ్వాళులివ్వంగ వో మౌనులారా!
శివుని దోలుకొని వచ్చిరంత.
ద్విపద:
గణన శక్యముగాని కడుమేడలోన
మణిమయ కళ్యాణ మంటపమందు
బిరుదైన నవరత్న పీఠంబుపైన
గురుమహిదేవున్ని గూర్చుండ బెట్టి
అక్షమాలిన మెప్పైన తిధినాడు
లక్షణంబైనట్టి లగ్నము జూచి
వనిత సహితముగాను వరపూజ జేసి
తనకన్య కనుదెచ్చి ధారవోసె.
కీర్తన - 48:
రాగం:నాట తాళం:ఏక
లగ్నమాయెను హరునికి లలనా గౌరుకు వోయమ్మా
సుజ్ఞులైనముని సుదతులందరు ప్రజ్ఞలూరి పెండ్లి పాటలు పాడగ ||లగ్న||
శాధిమానులై ప్రమధుల శంఖములూదగవోయమ్మా
యూధనాయకులు కొనరు జెప్పుచును
మాధవుండు నిజమంత్రియుగాంగను ||లగ్న||
సాధుఋషులై వేదములు స్వస్తినుడుపగనోయమ్మా
క్రోధమూర్తికిని గురుయాఙ్ఞికము
మేధావియు పరమేష్టి రచింపగ ||లగ్న||
బాధవిడెనని దశదికృతులు బాగుపడగ నోయమ్మా
సాధనమునుగొని గంధర్వలు
తాధిమితాయనితాండవమాడగ ||లగ్న||
వీధులిండ్లను పుష్పవృష్టి గురవగనోయమ్మా
విదితమైన మణిదీప ధూపములు సౌధమందు విస్తారము వెలయగ ||లగ్న||
భూధరేంద్రుని ముందట పురజనులందరు నోయమ్మా
బోధ మంత్రపురి భూతపతియును
సాధించెననుచు చప్పట్లేయగ ||లగ్న||
గీ||అనఘుడు మంగళ సూత్రము
మునికాంతలు పుణ్యసతులు పుణ్యసతులు ముట్టుచునిడగా
తనదాయువృద్ధి యగుటకు
ననపాయిని మేడకు గట్టె నాక్షణమందున్
యాలలు:
పిక్కటిల్లి ప్రజలుజూడ భేరి బాంకారములు
మ్రోయ గ్రక్కునాదీక్షాబంధనమాయ వో
మౌనులారా! కంకణములు గట్టి రుభయులకు
పచ్ఛనక్షింతలు ముత్యాలు బాగుగా తల్వాలీడుకొని
ఇచ్చదీరా కొంగులుముడినొంది వో మౌనులారా!
యెక్కిరీమంగళవేదికయందు
ద్విపద:
ఆ వధూవరులు దివ్యాసనంనందు
ఉపవిష్ఠులైలాజహోమంబుదీర్చి
పార్వతిచే సప్త పదముత్రొక్కించి
సర్వేశ్వరుడు నావె సరిచేతబట్టి
పావకు చుట్టు ప్రణనామమీడి
అపుడు సుఖాసీనులైయున్న వేళ
తాపసుల్ మంత్రాక్షతలు వేయగాను.
వచనం: అపుడా జగత్కుటుంబీకులకు రమా,భారతి,పౌలోను
మొదలైన పుణ్యాంగనలు మంగళారతులేమని పాడుచున్నారు.
కీర్తన - 49:రాగం:భైరవి తాళం:ఏక
నేమముగను సృష్టి నేలు మాతండ్రి మీకు
శ్రీ మంగళం శంభో జయ మంగళం ||జయ మంగళం||
మిగల నాధారమైన మేదిని సింహాసనమై
గగనము ఛత్రమమరి గలిగియుండిన శంభో ||జయ మంగళం||
సొగసు మీరంగ చంద్రా సూర్యులు దీపంబులై
జగమున మారుతము చామరమైన శంభో ||జయ మంగళం||
పగలు రేయులు నెడ బాయని పుష్పములై అగుపడియున్న
దిక్కులంబరమైన మీకు శ్రీ మంగళం ||జయ మంగళం||
అగణితమైన తారలన్ని తలువాలుగానై
భగవతితోడ పెండ్లిపండుగాడిన మీకు ||జయ మంగళం||
నిగమకందంబములు నిరతమువంది గణమై
తగుననగ మంథెన్న ధాముడవైన శంభో ||జయ మంగళం||
ఇత్యేతమేవ సర్వేషాం ప్రాణినాం జగతామపి
పిత్రోః పురానదంపత్యో ద్వివాహమతులంబబౌ ||జయ మంగళం||
కీర్తన - 50:
రాగం: కన్నెడ తాళం:ఆట
శైలరాజు చేసెనమ్మా ఈశ్వరా వివాహమాయెను సుమ్మా
సేలుగాను శాశ్వత రూపమునా
స్వీకరించిన సతీ పురుషులకు ||శైలరాజు||
శౌలి తండులన్నములెల్ల సంఙ్ఞాతభక్ష్య భోజ్యములెల్ల
మేదుజాతి శాఖము లెల్ల మృష్టాన్నపాయసములతో
నాలుగార్దీలు నిట్లుగపదు నాలుగు భువనములు వారికి
శీలమొప్పిన భోజనములతో క్షీరదధి మధు ఘృతములతో ||శైలరాజు||
గంధాపరిమళంబులుజూసి శాంగారపు మాలలు వేసి
పొందువసనాములన్ భోరుకొలుపుతాంబూలములా
అందముగమణి దీపములు పణవానకములువెలసి మ్రోయగ
ఇందు వదనలు కడువసంతములెనసి కొలువనతి మోదముతో ||శైలరాజు||
నాకపూజనారాధించి వైదీకతాంత్రీకంబున మించి
లోకమెల్లచేకొని యెన్న నా లోనజూడ
కన్నులపండవులై ఏకశోడశమహాదానము
లెల్లసాద్గుణ్యములొసంగును నేకృతార్థుడననుచు
మంత్రపురీశ్వరుని సుప్రీతినొనరగా ||శైలరాజు||
ద్విపద:
ఆ వివహముదీర నా దేవతులును
కావున తమ ఇండ్లకడకేగిపోంగ
మామ యింట శివుడు మాసము గడిపి
భామతో నావేళ పైనంబుగాంగ
గిరి దంపతులుజూచి ఖిన్నులగుచును
గరితనుముద్దాడి కౌగిటన్ జేర్చి
కరములు వణకుచుకన్నీరు రాంగ
పరమేశ్వరుని గూర్చి పలికిరిట్లనుచు.
కీర్తన - 51:
రాగం:ఘంటారం తాళం:ఆది
యెటలెలదోనాసామి యేమి నేరదీభవాని ||పల్లవి||
దశలాడిసాధుసుమ్మి దయచేసి యేలుకొమ్మి
పసిబాలఝాణకాదు పనిపాటకోరవ్వలేదు ||యెటు||
శశిమౌళికోపివని మీజాడ మాకు ముందెతెలుసు
కసిగందురవ్వ వేగు కఠినములాడబోకు ||యెటు||
కుశలంబు మంత్రకూట కొలువైన దీవొయ్యారి
యెటులేలెదోనాసామి యేమి నేరదీభవాని ||యెటు||
శ్లో||ఇత్యాదివచనైర్యుక్త్వా హిమవాంలోకశంకరం
ప్రేమాదత్వేనాంపుత్రీం పాధేయానిచదత్తవాన్
యాలలు:
అందరానట్టి గంధర్వ హయము
లైరాపతనాగములన్ అందమైనా దాసీజనులాను
వో మౌనులారా! అరణములు వెయ్యారులిచ్చెనూ.
భోరునా మైనాకుండను పుత్రునివెంబడిగానిచ్చీ
సారెలు తెరువులందునగట్టి వో మౌనులారా!
సాంబశివుని సాదోలిరి.
ద్విపద:
భూత సంఘములెల్ల బొగడియాడంగ
నాతినంకము జేర్చనందిపైనెక్కి
భూతేశుడింటికైబోవుచుండంగ
ఆతెరువునందున యారామమొకటి
వొనరగా పొడజూసి యందుండతలచి
ఘనలైన ప్రమధులన్ గౌరితమ్మున్ని
కైలాసశిఖరంబు కడకేగనంపి
వాలాయముగనిట్లు వసియించెనట.
కీర్తన - 52:
రాగం:కాంభోజి తాళం:జంపె
ఆ హిమాచలమందు నంబికాదేవితో
హరుడు విహరించెనమ్మా కొమ్మా ||అ హిమ||
గ్రహములు మెదులు గంగాతీరమున నొక్క
కనకగుహయందు జేరి కోరీ ||ఆ హిమ||
వింతానొకచోట విరులపాన్పున జేరి
విడములందించుకొనుచు నగుచు
విరజాతి బంతులను మెవడేసి బాగుగ
పన్నీరు పరిమెళమ్ముల విసరి ధరించి మించి ||ఆ హిమ||
పంతామీడరే ననపరి రంభణము జేసి
పరగ చెక్కిలులు నొక్కి సొక్కి బహు
సంతసిల్లుచు తీర సరస సల్లాపములు సలిపి
కెమ్మోవియానీ పూనీ ||ఆ హిమ||
చింతనేమిట లేక శృంగార పరవశముజెంది
నిశిదినములనక కనకా అకేళి
అంతరంగమున దివ్యాంగణము ధీర్తిల్ల
అందు చీకట్లు దొలుగా వెలగా ||ఆ హిమ||
అంతకంతకు మోహమధికమవ నిద్రయా
హార పానములు మరిచీ విడచీ లౌకిక
మింతగానక దేహామిటులకావిరిగమ్మి
యిచ్చమరిమరియు గలిగీ చెలగీ ||ఆ హిమ||
కొంత తడుపు హారతుల కొంతటను సమరతుల
కొంతసేపలసీ సొలసీ వెలసీ నేడు మా
మంథెన్న నిలయుడామగువ భావము జూచి
మదన సంగరము నరసీ మురసీ ||ఆ హిమ||
వచనం: ఇట్లు హైమవైతింగూడి శివుడు కేళీవిలాస
లోలుడై యా పర్వతరాజ తనయ యానవ గిరిదుర్గ
ప్రాంతంబుల దనియుచు,దనిపించుచు నుండి.
(శివకథా ప్రశంస గీతము)
యీ శివ గీతము నేమని పొగడుదు
యెన్నదగునదీ శివగీతం ||1||
పాపములను పావనముచేయును
బాడబానలమీ శివగీతం ||2||
కలుషమైన యందకారము మాన్పును
ఖగ మండలమీ శివగీతం ||3||
వరదురితముల నెగిరులను ద్రుంచును
వజ్రాయుధమీ శివగీతం ||4||
దోషములనియెటి దురువిషయములకు
ధూమకేతువీ శివగీతం ||5||
మంత్రకూటమున మహాత్ముల కిది
మందారంబీ శివగీతం ||6||
ఇతి శ్రీ సీతారామ సరస్వతీ శిష్య ముద్దు రాజేశ్వర సునూనాం,బాలంభట్టేన విరచితాయాం,యక్షగాయనే,శ్రీ మదుమామహేశ్వర కథాయాం,శ్రీ గౌరి జననం పార్వతీ కళ్యాణం ద్వితీయాశ్వాసం సమాప్తః.
చాలా ప్రశంసార్హము అభినందనలు
రిప్లయితొలగించండితృతీయాశ్వాసం లేదా? మీ వివరాలేమీ తెలియడం లేదు